May 26,2023 19:21

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
- జాయింట్‌ కలెక్టర్‌ టి. నిశాంతి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు తోడ్పాటును అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ టి. నిశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో పర్యావరణ పరిరక్షణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి నిశాంతి మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 27 నుండి వచ్చే జూన్‌ 5వ తేదీ వరకు గ్రామ, మండల స్థాయిలలో ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. అలాగే పంచాయతీరాజ్‌, ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, పర్యావరణం తదితర శాఖలు పర్యావరణ పరిరక్షణ అంశంపై ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి శనివారం సాయంత్రంలోగా డిఆర్‌ఓ కు పంపాలని ఆమె ఆదేశించారు. పబ్లిక్‌ కొళాయి నుండి వృధా నీటిని అరికట్టడం, మురికి కాలువలు శుభ్రం చేసుకోవడం, ప్లాస్టిక్‌ నిషేధం, మొక్కలు నాటడం తదితర పర్యావరణ పరిరక్షణ పనులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్‌ ద్వారా ఫైల్స్‌ పంపుతూ పేపర్‌ వృధాను అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి పుల్లయ్య, పంచాయతీరాజ్‌, ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, పర్యావరణం, గ్రామీణ నీటి సరఫరా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.