ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలని కలెక్టర్ అరుణ్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో కౌన్సిల్ రెండవ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షించారు. తనకల్లు మండలం కోటపల్లి దగ్గర రూ. 149 కోట్లతో ఏర్పాటు చేయనున్న రేస్ కోర్స్ నిర్మాణ పనులపై కలెక్టర్ ఆరా తీశారు. అలాగే పెనుకొండ దగ్గర కుంభకర్ణ, ఎన్‌పి కుంట మండలంలో తిమ్మమ్మ మర్రిమాను, లేపాక్షి జటాయువు, రామగిరి మండలం నసనకోట దుర్గాదేవి దేవాలయం ప్రాంతంలో ఉన్న పర్యాటకశాఖ భవన సముదాయాలను బాడుగలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కియా పరిశ్రమ వద్దనున్న అతిథి గృహానికి సంబంధించి పెండింగ్ బకాయిల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ రామచంద్ర, జిల్లా అధికారి నాగేశ్వరరెడ్డి, ఎపిఒ ప్రతాప్ రెడ్డి, మేనేజర్ దీపక్, కౌన్సిల్ సభ్యులు సాయిటవర్ పద్మనాభం, మల్లికార్జున, సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి ఆనంద్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చాంద్‌భాషా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










