Oct 06,2023 21:54

ఆడలి వ్యూపాయింట్‌ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

సీతంపేట: పర్యాటక పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. సీతంపేట ఐటిడిఎ పరిధిలో శుక్రవారం పర్యటించిన అభివృద్ధి కార్యక్రమాలను తనిఖీ చేశారు. మండలంలోని ఆడలి వ్యూ పాయింట్‌ అభివృద్ధి పనులను కలెక్టర్‌ పరిశీలించారు. పనులను వేగవంతంగా నవంబర్‌ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపించకూడదని ఆయన స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే పనులు చేపట్టాలన్నారు. గిరిజన మ్యూజియం పనులను పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. పర్యాటకుల తాకిడి జిల్లాలో ముఖ్యంగా సీతంపేట ప్రాంతంలో ఎక్కువగా ఉందని దాన్ని మరింత పెంచాలన్నారు. పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల చిన్న వ్యాపారాలు పెరుగుతాయని, స్థానికులకు ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు. ఒక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనా కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్‌ సింహాచలం, జేఈ భూషణ్‌, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.