ప్రజాశక్తి - ఆదోని
ఎన్నో దశాబ్ధాల చరిత్ర కలిగిన రాంజల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ శాంత, వైసిపి ఇన్‌ఛార్జీ జయ మనోజ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.5 కోట్లతో రెండు దశల్లో చేపట్టే రాంజల అభివృద్ధి పనులకు, పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసే పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారని చెప్పారు. రాంజల చెరువు ప్రాంతంలో చిన్న పిల్లలు ఆడుకొనేందుకు ఆట వస్తువులు, సిటీలో మాదిరిగా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మొదటి దశలో రూ.2.5 కోట్లతో పనులు చేపడుతున్నామని చెప్పారు. ఏడాదిలోపు అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే కుడా ద్వారా మంజూరైన రూ.25 లక్షలతో ఎల్‌ఐజి కాలనీలో పార్కు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వివరించారు. రాంజల చెరువులో చేపల వేటకు వెళ్లకుండా చేస్తున్నామని, ప్రత్యేకంగా నిఘా ఉంచుతున్నట్లు తెలిపారు. వైస్ ఛైర్మన్లు ఎంఎంజి.గౌస్, నరసింహులు, మున్సిపల్ ఇంజినీర్లు రాజశేఖర్, వైసిపి సీనియర్ నాయకులు రామలింగేశ్వర యాదవ్, ఆర్‌టిసి రహీం, కౌన్సిలర్లు వైజి.బాలాజీ, ఫయాజ్ అహ్మద్, చలపతి, రాజేశ్వర్ రెడ్డి, చిన్న, సురేష్, రఘునాథ్ రెడ్డి, వసీం పాల్గొన్నారు.
భూమి పూజ చేస్తున్న నాయకులు










