Apr 27,2023 23:07

మూడు చక్రాల సైకిల్‌ యాత్రలో వికలాంగుడు ప్రసాద్‌తో చైర్‌పర్సన్‌ ఇంద్రజ

ప్రజాశక్తి-హిందూపురం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విశాఖపట్నంకు రైల్వేజోన్‌ కోసం మూడు చక్రాల సైకిల్‌ యాత్ర చేపట్టినట్టు వికలాంగుడు ప్రసాద్‌ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం శ్రీకాకుళం జిల్లా కంచలి మండలం బురగాం గ్రామానికి చెందిన తాను 2018లోనే ఇచ్చాపురం నుండి ఉమ్మడి జిల్లా అనంతపురానికి మూడు చక్రాల సైకిల్‌ యాత్రను ప్రారంభించానన్నారు. అయితే కరోనా కారణంగా 2020లో నంద్యాల వరకు యాత్ర నిర్వహించి నిలిపివేశానన్నారు. ఆ తరువాత తిరిగి ఈ ఏడాది జనవరి మొదటి వారం నుండి సైకిల్‌ యాత్రను ప్రారంభించినట్లు చెప్పారు. 23 జిల్లాలోనూ ఈ సైకిల్‌ యాత్ర నిర్వహించి ఢిల్లీకి వెళ్తానన్నారు. అక్కడ 7 రోజుల పాటు సైకిల్‌ ర్యాలీ చేపడుతున్నట్లు పేర్కోన్నారు. తాను నిర్వహించిన ఈ యాత్రలో జిల్లాలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెవిన్యూ, పోలీసులు తనకు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. గురువారం హిందూపురానికి చేరుకున్నానని ఇక్కడ అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి ఇక్కడి నుంచి పుట్టపర్తి వరకు వెళతానని చెప్పారు. ఇక్కడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రసాద్‌ను అభినందించి, ఆర్థిక సాయాన్ని అందించారు. వీరితో పాటు మున్సిపల్‌ ఉద్యోగులు ఆర్థిక సాయం అందజేశారు.