Apr 20,2023 22:21

మూడు చక్రాల సైకిల్‌ యాత్రలో వికలాంగుడు ప్రసాద్‌

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విశాఖపట్నంకు రైల్వేజోన్‌ కోసం మూడు చక్రాల సైకిల్‌ యాత్ర చేపట్టినట్టు వికలాంగుడు ప్రసాద్‌ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం శ్రీకాకుళం జిల్లా కంచలి మండలం బురగా గ్రామానికి చెందిన తాను 2018లోనే ఇచ్చాపురం నుండి ఉమ్మడిజిల్లా అనంతపురానికి మూడు చక్రాల సైకిల్‌ యాత్రను ప్రారంభించానన్నారు. అయితే కరోనా కారణంగా 2020లో నంద్యాల వరకు యాత్ర నిర్వహించి నిలిపివేశానన్నారు. ఆతరువాత తిరిగి ఈఏడాది జనవరి మొదటి వారం నుండి సైకిల్‌ యాత్రను ప్రారంభించినట్లు చెప్పారు. 23 జిల్లాలోనూ ఈ సైకిల్‌ యాత్ర నిర్వహించి ఢిల్లీకి వెళ్తానన్నారు. తాను నిర్వహించిన ఈ యాత్రలో జిల్లాలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని డిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెవిన్యూ, పోలీసులు తనకు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. గురువారం రాత్రి ధర్మవరానికి చేరుకున్నానని, తిరిగి శుక్రవారం ఉదయం బయలుదేరి లేపాక్షి వరకు ఈ యాత్రను కొనసాగిస్తానని ప్రసాద్‌ తెలిపారు.