Sep 08,2023 19:30

ఎండిపోయిన ఆముదం పంటను తొలగిస్తున్న కూలీలు

ప్రజాశక్తి-ఆలూరు
ఖరీఫ్‌ సీజన్‌లో మొదట్లో కురిసిన వర్షాలకు రైతులు పంటలను సాగు చేశారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోయాయి. రైతుల పెట్టుబడులు నేలపాలయ్యాయి. పంటలు ఎండిపోవడంతో తొలగించారు. ఈనెలలో వర్షాలు కురవడంతో మళ్లీ వేరే పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌ నెలలో వర్షం కురవడంతో ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామానికి చెందిన రైతు ఎర్రి స్వామి 5 ఎకరాల్లో ఆముదం పంట సాగు చేశారు. రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ఆగస్టులో వర్షాలు కురవకపోవడంతో పంట గిడుసుబారి ఎండిపోయింది. వర్షాలు కురవకపోవడంతో రైతుల పెట్టుబడి నేల పాలయింది. ఈనెలలో కురిసిన వర్షానికి రైతులు ఆశలు వదులుకోలేక ఎండిపోయిన ఆముదం పంటను తొలగించి మళ్లీ అప్పు చేసి జొన్న పంట సాగుకు సిద్ధమవుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రతి గ్రామంలోనూ చాలామంది రైతులు ఎండిపోయిన పత్తి, ఆముదం పంటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
11,188 హెక్టార్లలో పంటల సాగు
ఆలూరు మండలంలో ఖరీఫ్‌లో సాధారణ సాగు 35,945 ఎకరాలు. కాగా 27,970 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. ప్రధానంగా పత్తి 20,175 ఎకరాలు, ఆముదం 950 ఎకరాల్లో సాగు చేశారు. ఆగస్టు నెలలో ఒక్కరోజు కూడా వర్షం కురవకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయి.
అప్పులు చేసి ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధం
ఎండిపోయిన పంటలను తొలగించుకొని కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. మొదట్లో వేసిన పంటలో దెబ్బతిని నష్టపోయిన రైతుకు గోరుచుట్టుపై రోకలి పోటు మాదిరిగా మళ్లీ అప్పు చేసి ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధమవుతున్నారు.
రూ.30 వేలు నష్టపోయాను
- ఎర్రిస్వామి, రైతు పెద్దహోతూరు

ఐదెకరాల్లో రూ.30 వేలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశాను. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోయాయి. పంట ఎండిపోవడంతో రూ.30 వేలు నష్టం వచ్చింది. సెప్టెంబర్‌లో వర్షాలు కురవడంతో మళ్లీ అప్పు చేసి జొన్న పంటను సాగు చేస్తున్నాను.