Nov 04,2023 21:31

ఫొటో : బోయలచిరువెళ్లలో సచివాలయం ప్రారంభిస్తున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

ప్రతిఒక్కరికీ అందుబాటులో ప్రభుత్వ సేవలు
- బోయలచిరువెళ్లలో సచివాలయం, ఆర్‌బికెలను ప్రారంభించిన ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : గతంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి మండల కేంద్రాలకు వచ్చేవారని, ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ప్రభుత్వ సేవలు తీసుకొచ్చారని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బోయలచిరువెళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన ఎంఎల్‌ఎ మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించి గ్రామ ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయాల ద్వారా వివిధ శాఖల సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందుచూపుతో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిందన్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలలో ఎరువులు, విత్తనాలు, రైతులకు అవసరమైన వివరాలు అన్ని అందుబాటులో ఉంటాయని, ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రం, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన సేవలను అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి, జెసిఎస్‌ కన్వీనర్‌ వల్లభనేని రాజేంద్ర, బట్టేపాడు చైర్మన్‌ బొమ్మి,రెడ్డి రవికుమార్‌ రెడ్డి, సర్పంచులు బొలిగెర్ల వెంకటేశ్వర్లు, సతీష్‌, కేత రవీంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ
మండలంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అందజేశారు. ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామానికి చెందిన పులిమి సుధాకర్‌ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.60వేలు మంజూరైంది. అదే విధంగా బొటికర్లపాడుకు చెందిన గాలి బుజ్జమ్మకు రూ.65వేలు, కరటంపాడు గ్రామానికి చెందిన పీ జిలానీ బేగంకు రూ.55 వేలు మంజూరు కావడంతో బోయలచిరువెళ్ల సచివాలయం వద్ద లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.