Nov 14,2023 21:45

పార్వతీపురంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేస్తున్న బివిపట్నాయక్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించుకొనుటకు గ్రంథాలయాలు ప్రధానపాత్ర పోషిస్తాయని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ బివి పట్నాయక్‌ అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఏకలవ్య పాఠశాలలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం, బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్ర పటానికి పూలమాలను వేసి, నివాళ్లు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించుకొనేందుకు గ్రంథాలయాలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ప్రతి ఒక్కరికి పుస్తక పఠనం తప్పనిసరి అని తెలిపారు. సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదగాలంటే జ్ఞాన సంపద అవసరమని, పుస్తక పఠనం ద్వారానే అది సాధ్యపడుతుందని వివరించారు. ఎపి గ్రంథాలయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.పారినాయుడు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవర్చుకోవాలని, ఇందుకు గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. భారతీయ సామాజిక, సాంస్కతిక, ఆర్థిక, ఆరోగ్య పునర్వికాసానికి, ప్రకృతి వ్యవసాయమే ఆధారం అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు టి.శివకేశవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సాలూరు: గ్రంథాలయాలను యువత వినియోగించుకోవాలని ఎంఇఒ దాసు కోరారు. మంగళవారం గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం గ్రంథాలయాల్లో పుస్తక పఠనం ద్వారా వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో వేదసమాజం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ ఎం నాగేశ్వరరావు,శాఖా గ్రంథాలయం అధికారిణి పాల్గొన్నారు.
వీరఘట్టం: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు మనవడు కోడి వెంకటరమణ నాయుడు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఎం వెంకటేశ్వరరావు, పాఠకులు పాల్గొన్నారు.
పార్వతీపురం టౌన్‌ : పట్టణంలోని నెయ్యిల వీధిలో ఉన్న శాఖా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలను ప్రముఖ బాల సాహిత్య వేత్త బి.ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఎ.ధర్మారావు, ఆడబడి ప్రాథమిక పాఠశాల, ఎంఇఒ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనార్ధన్‌రావు, కె.శ్రీనివాసరావు, విశ్రాంత టీచర్‌ ఎ.మిన్నారావు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీతానగరం : స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను ఎంఇఒ జి.సూర్యదేవుముడు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రంథాలయ అధికారి టి.వెంకటరావు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను ఎంఇఒ నగిరెడ్డి నాగభూషణరావు జ్యోతి ప్రజ్వలన చేయగా, సర్పంచ్‌కలిసే ఇందుమతి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక గ్రంథాలయాధికారి నల్ల మధుసూదనరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీతంపేట : స్థానిక శాఖాగ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఐటిడిఎ డిప్యూటీ డిఇఒ లిల్లీ రాణి ప్రారంభించారు. ముందుగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి, నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో పాఠకులు, గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్‌ బాబు, సహాయకులు రామకృష్ణ పాల్గొన్నారు.
పాలకొండ : స్థానిక శాఖా గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను చిన్న మంగళాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జామి రవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం హెచ్‌ఎం మాట్లాడుతూ పోటీ పరీక్షలకు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని విజ్ఞానవంతులు కావాలన్నారు. కార్యక్రమంలో అడ్మిన్‌ శివకృష్ణ, భాస్కర్‌రావు, చందు, ఇన్‌ఛార్జి గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్‌ బాబు, సహాయకుడు ఈశ్వర్‌ పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : స్థానిక శాఖా గ్రంథాలయంలో 56వ గ్రంథాలయ వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వాహకులు డి.సుకన్య గ్రంథాలయాల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.