ప్రజాశక్తి - హోళగుంద
జలజీవన్ మిషన్ ద్వారా ఎల్లార్తి గ్రామంలో టెండర్లు పూర్తయిన వెంటనే రూ.56 లక్షలతో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. గురువారం మండలంలోని ఎల్లార్తి గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. నాయకులు, అధికారులు, గ్రామస్తులు తప్పెట్లు, శాలువా, బాణసంచా, పూలమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నియోజకవర్గానికి రూ.1050 కోట్ల సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు. గ్రామంలో సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.16.42 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. గ్రామ సచివాలయం నిధులు రూ.10 లక్షలతో 60 వేల లీటర్ల నీటి సంపు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామంలో రూ.10 లక్షలు మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని చెప్పారు. అనంతరం గ్రామంలో వెలసిన హజరత్ షేక్షావలీ, హజరత్ షాషావలీ దర్గాలను సందర్శించి ప్రత్యేక ఫాతేహాలు నిర్వహించారు. మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి, సర్పంచి కె.చాముండేశ్వరి, ఎంపిపి తనయుడు ఈషా, మండల కన్వీనర్ షఫీ, జడ్‌పిటిసి బావ శేషప్ప, నాయకులు మల్లికార్జున, ఎస్‌కె.గిరి, దర్గప్ప, లక్ష్మీకాంత్, మాజీ జడ్‌పిటిసి రాంభీం నాయుడు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేస్తున్న మంత్రి గుమ్మనూరు










