Aug 09,2023 20:57

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - మంత్రాలయం
నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామమైన రాంపురంలో ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలోనే తుంగభద్ర డ్యాం నుంచి దిగువన ఉన్న నదికి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆ నీటిని గురురాఘవేంద్ర ప్రాజెక్టులకు మళ్లించి నింపాలని సూచించారు. నదికి నీరు రాకముందే ఎక్కడైనా మోటార్లు మరమ్మతులు ఉంటే చేయించాలని, సమస్య తీవ్రంగా ఉంటే నివేదికలు సిద్ధం చేసి తనకు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వైసిపి మండలాధ్యక్షులు జి.భీమిరెడ్డి, ఐరన్‌గల్‌ శ్రీనివాస్‌ రెడ్డి, జిఆర్‌పి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శైలేశ్వర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు మురళీ, కృపానంద్‌, ఎఇలు హరిప్రసాద్‌, ప్రేమ్‌, రంగస్వామి, ఈశ్వర్‌, రాజేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.