Apr 03,2023 21:50

పరీక్ష కేంద్రం వద్ద వేచి ఉన్న విద్యార్థులు

ప్రజాశక్తి- హిందూపురం : పది పరీక్షలు ప్రశాంతంగా సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. మొత్తం పట్టణం, రూరల్‌ మండలంలో 13 పరీక్షా కేంద్రాల్లో 3380 మంది విద్యార్థులు హాజరు కావాల్సుండగా 29 మంది విద్యార్థులు గైర్హాజరైనటుల మండల విద్యాశాఖ అధికారి గంగప్ప తెలిపారు. పట్టణంలో, రూరల్‌ మండలంలో 7 పరీక్ష కేంద్రాలను ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ నాగరాజు పరిశీలించారు. ఎండలు ఎక్కువ ఉండడంతో పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
బత్తలపల్లి : బత్తలపల్లిలోని మూడు కేంద్రాలలో నిర్వహించిన పదోతరగతి పరీక్షలను సజావుగా జరిగాయి. మూడు కేంద్రాల్లో 483 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 478 మంది హాజరైనట్లు ఎంఇఒ చాముండేశ్వరి తెలిపారు. పరీక్షా కేంద్రాలను తహశీల్దార్‌ తదితరులు తనిఖీ చేశారు.
గాండ్లపెంట : పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బుక్కపట్నం : మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రెండు పరీక్ష కేంద్రా లలో పరీక్షలు నిర్వహించగా 390 మంది విద్యార్థులకు గాను 385 మంది హాజరయ్యారు. మొదటి రోజు పరీక్ష కేంద్రాలను అసిస్టెంట్‌ కమిషనర్‌ నాగరాజు, తహశీల్దార్‌ నటరాజ్‌, ఎంఇఒ గోపాల్‌ నాయక్‌ తదితరులు తనిఖీ చేశారు.
కొత్తచెరువు : కొత్త చెరువులోని జిల్లా పరిషత్‌ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలు, శ్రీవిద్య పాఠశాలలో పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు డివైఇఒ రంగస్వామి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ నాగరాజు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ వెంకటరమణా నాయక్‌ హెచ్‌ఎం సుమన, చెన్నకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
అగళి : పదవ తరగతి పరీక్షలు సజావుగా ప్రారంభమైనాయి మండలంలోని ఐదు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, కెజిబివి విద్యార్థులు మొత్తం 536 మంది పరీక్షకు అయ్యారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రెండు రోజులు ముందే విద్యార్థులకు హాల్‌ టికెట్లు పంపిణీ చేశారు .ఆగలి ఎంఇఒ గోపాల్‌ పరీక్ష రాసే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 30 నిమిషాల ముందే విద్యార్థులు పరీక్ష సెంటర్లకు చేరుకున్నారు. సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ లావణ్య ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
రొద్దం : సోమవారం నిర్వహించిన పదవ తరగతి పరీక్షలు మండలంలో సజావుగా జరిగాయి. మండల కేంద్రంలో మూడు సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. అయితే మండలంలో కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు సమయానికి హాజరు కావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సు సౌకర్యం లేకపోటంతో రాచూరు గ్రామానికి చెందిన స్వాతి అనే విద్యార్థిని 9 :29 గంటలకు పరీక్షకేంద్రంలోకి వెళ్లంది. విద్యార్థిని వెంట ఆమె తల్లి కూడా పరుగులు పెట్టి కూతురికి సాయం చేసింది. ఈ పరీక్షలను తహశీల్దార్‌ అనంతచారి, ఎంపిడిఒ రాబర్ట్‌ విల్సన్‌ తదితరులు పరిశీలించారు.
గోరంట్ల : మండల కేంద్రంలో ఏడు సెంటర్లలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షలను తహశీల్దార్‌ రంగనాయకులు తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై పరిశీలించారు.
కదిరి టౌన్‌ : పదో తరగతి పరీక్షలు తొలిరోజు సజావుగా జరిగాయి.కదిరి మండల వ్యాప్తంగా 2009 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ఎంఇఒ చెన్నకృష్ణ తెలిపారు. పరీక్షా కేంద్రాలను కదిరి ఆర్టీవో రాఘవేంద్ర తనిఖీ చేశారు.