ప్రజాశక్తి - కురుపాం : జిల్లాలోని ఒక పంచాయతీకి, ఒక వార్డు సభ్యునికి శనివారం జరిగిన ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. కురుపాం మండలంలో గుమ్మ సర్పంచ్ స్థానానికి శనివారం జరిగిన ఉపఎన్నిక ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. వైసిపి బలపర్చిన అభ్యర్థి ఆరిక గోపాలరావు 54 ఓట్లు మెజార్టీతో గెలిపొందినట్లు ఎన్నికల అధికారి ఎ.సాంబమూర్తి తెలిపారు. ఆయన అందించిన వివరాలు ప్రకారం గ్రామంలో 1202 ఓట్లు గాను 937 ఓట్లు పోలవ్వగా, వైసిపి బలపర్చిన అభ్యర్థి ఆరిక గోపాలరావుకు 366 ఓట్లు రాగా, టిడిపి బలపరిచిన అభ్యర్థి కొండగొర్రె వెంకటరావుకు 312 ఓట్లు, టిడిపి రెబల్ అభ్యర్థి తోట పట్టయ్యకు 157 ఓట్లు, లిమ్మక భానుప్రసాద్‌కి 79 ఓట్లు, 19 ఓట్లు చేల్లనివిగా, 4 ఓట్లు నోటాకు పడినట్లు తెలిపారు.
ఏకగ్రీవమైన నాలుగో వార్డు
పార్వతీపురంరూరల్ : మండలంలోని రావికోన పంచాయతీలో నాలుగో వార్డు స్థానానికి ఏర్పడిన ఖాళీలో జరిగిన ఉప ఎన్నికలో డి.జానకమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వో బసవరాజు ప్రకటించారు. ఈ మేరకు ఆమెకు శనివారం నియామక ధ్రువపత్రాన్ని అధికారులు అందజేశారు.
బొబ్బిలిరూరల్.. మండలంలోని కొండదేవుపల్లిలో రెండో వార్డులో టిడిపి బలపర్చిన అభ్యర్థి పూతి సత్యనారాయణ.. వైసిపి మద్దతిచ్చిన రంభ లక్ష్మిపై 26 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల పరిశీలకులుగా ఎంపిడిఒ రవికుమార్, రూట్ ఆఫీసర్‌గా శ్రవణ్ కుమార్ వ్యవహరించారు. సిఐ నాగేశ్వరరావు ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటుచేశారు.
డెంకాడ.. మండలంలోని డి.తాళ్లవలస గ్రామంలో ఏడో వార్డు ఉప ఎన్నికల్లో వైసిపి బలపరిచిన అప్పల సత్యవతికి 105 ఓట్లు, టిడిపి మద్దతు అభ్యర్థికి 17 ఓట్లు వచ్చాయి. 88 ఓట్ల తేడాతో సత్యవతి విజయం సాధించారు.
బొండపల్లి.. మండలంలోని దేవుపల్లిలో 13వ వార్డు సభ్యులుగా టిడిపి మద్దతిచ్చిన గాదం రాజేంద్ర కుమార్ విజయం సాదించారు. రాజేంద్రకు 106 ఓట్లు రాగా, మలిరెడ్డి శ్యామలరావుకు 86 ఓట్లు వచ్చాయి. సిఐ లెంక నారాయణరావు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
జామి.. మండలంలోని లొట్లపల్లిలో పదో వార్డు ఉప ఎన్నికలో వైసిపి బలపరిచిన గంగమ్మ.. ప్రత్యర్థి చందక గౌరిపై 10 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి గంగరాజు ప్రకటించారు.
బాడంగి.. మండలంలోని పాల్తేరులో ఆరో వార్డు ఉప ఎన్నికలో వైసిపి మద్దతుదారు పూడి సత్యవతి.. ప్రత్యర్థిపై 76 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కొప్పెర్లలో వైసిపి రెబల్ అభ్యర్థి విజయం
పూసపాటిరేగ.. మండలంలోని కొప్పెర్ల సర్పంచ్‌గా వైసిపి రెబల్ అభ్యర్థి సంకాబత్తుల సత్తిబాబు 88 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసిపి, టిడిపి ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థి పైడి పార్వతమ్మ ఓటమిపాలయ్యారు. సత్తిబాబుకు ఎంపిడిఒ జి.రామారావు, ఎన్నికల ఆర్‌ఒ పాపునాయుడు ధ్రువపత్రం అందజేశారు. తనది ప్రజా విజయమని సర్పంచ్ సత్తిబాబు తెలిపారు. గ్రామంలో టిడిపి, వైసిపి, జనసేన కలిసి తనను ఓడించాలని ప్రయత్నించారని, ఓటర్లను బెదిరించారని, అందుకే ప్రజలు తిరగబడ్డారని చెప్పారు.
వంగరలో టిడిపి... ఓని అగ్రహారంలో వైసిపి..
వంగర.. మండలంలో లక్షింపేట, ఓని అగ్రహారం సర్పంచ్ స్థానాలకు, రుషింగిలో వార్డు మెంబర్‌కు జరిగిన ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. లక్షింపేటలో వైసిపి బలపరిచిన అభ్యర్థి వాన లక్ష్మీనారాయణపై టిడిపి మద్దతు అభ్యర్థి ఆవు సుజాత 67 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓని అగ్రహారంలో టిడిపి బలపరిచిన అభ్యర్థి మజ్జి గౌరీశ్వరిపై వైసిపి మద్దతు అభ్యర్థి కాబోతుల రుక్మిణమ్మ 301 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. రుషింగిలో వార్డు స్థానానికి జనసేన బలపరిచిన అభ్యర్థి యలకల శ్రీనివాసరావుపై వైసిపి మద్దతుదారు యలకల రాము 36 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. లక్షింపేటలో టిడిపి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
పడాలపేట సర్పంచ్‌గా శ్రీదేవి
విజయనగరంటౌన్ విజయనగరం మండలం పడాలపేట పంచాయతీ సర్పంచ్‌గా వైసిపి మద్దతుదారు సువ్వాడ శ్రీదేవి విజయం సాధించారు. శ్రీదేవికి 736 ఓట్లు రాగా, టిడిపి మద్దతుదారు సుంకర రామలక్ష్మికి 284 ఓట్లు పోలయ్యాయి. కొండకరకాంలో తొమ్మిదో వార్డు సభ్యులుగా వైసిపి బలపరిచిన తుమ్మగంటి మంగ విజయం సాధించారు.
పెంటశ్రీరాంపురం సర్పంచ్‌గా గౌతమి
గంట్యాడ .. మండలంలోని పెంటశ్రీరాంపురం పంచాయతీ ఉప ఎన్నికల్లో వైసిపి మద్దతుదారు కరక గౌతమి.. టిడిపి బలపరిచిన కరక రామయ్యమ్మపై 146 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రెండో వార్డు స్థానానికి జరిగిన ఎన్నికలో వైసిపి మద్దతుదారు గేదెల విజయ గెలుపొందారు.
ఎన్నిక ఏదైనా గెలుపు వైసిపిదే : రాజన్నదొర
సాలూరు/పాచిపెంట : ఎన్నిక ఏదైనా గెలుపు వైసిపిదేనని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. పాచిపెంట మండలం పణుకువలస పంచాయతీ పరిధిలో ఒక వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో 85శాతం ఓట్లతో విజయం సాధించిన రెయ్యి సీతామాలక్ష్మిని ఆయన అభినందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపిపై ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలేదడానికి పంచాయతీ ఎన్నికలే నిదర్శనమన్నారు. పంచాయితీలో వార్డు మెంబర్ మరణించడంతో ఇక్కడ ఎన్నిక జరిగిందని, మానవతా దక్పథంతో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకి ఏకగ్రీవంగా వదిలేయాల్సి వుండగా టిడిపి పోటీ పెట్టిందని చెప్పారు. మొత్తం 153ఓట్లకు గాను వైసిపి అభ్యర్థి సీతామాలక్ష్మికి 130ఓట్లు పాలయ్యాయనీ చెప్పారు. గత ఎన్నికల ఫలితాలే రానున్న ఎన్నికల్లో పునరావృతమవుతాయనడానికి ఈ ఎన్నికలు తార్కాణమని రాజన్నదొర చెప్పారు.










