మీకు కళ్ళు చెదిరే బహుమతులు పంపుతామని ఏమైనా లింక్స్ వస్తున్నాయా...? ఆ గిఫ్ట్స్ కోసం మీ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడి, ఇతర వ్యక్తిగత వివరాలను అడిగారా....? అయితే మీ అకౌంట్‌లో డబ్బులు జాగ్రత్త... ప్రపంచ వ్యాప్తంగా 70దేశాల్లో ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లు ఇలాంటి మెసేజ్‌లతో ప్రమాదంలో పడనున్నారు. సైబర్ నేరస్తులు 'గిఫ్ట్ హార్స్' అనే మాల్‌వేర్ సాయంతో ఈ తరహా దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ సెక్యూరిటీ సంస్థ జింపేరియం తన తాజా నివేదికలో పేర్కొంది. సైబర్ నేరస్తులు పక్కా ప్లాన్‌తో గూగుల్ ప్లే స్టోర్, థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా(ఫిష్షీ) లింక్స్ పంపి యూజర్ల ఈమెయిల్, బ్యాంక్ అకౌంట్లను దొంగిలిస్తున్నారు.
డబ్బుల్ని ఎలా దొంగిలిస్తారు?
సైబర్ నేరస్తులు ముందుగా స్థానిక భాషల్లో వినియోగదార్లను ఆకర్షించే విధంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లకు యాడ్స్‌ను పంపుతారు. ఆ యాడ్స్‌లో ఉన్న లింక్ ఎవరు క్లిక్ చేస్తారో వారికి కళ్లు చెదిరే బహుమతులు పంపిస్తామని ఆశపెడతారు. ఆ ఆఫర్లకు ఆకర్షితులై... పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు. మీరు సెలెక్ట్ చేసుకున్న గిఫ్ట్ మీకు కావాలనుకుంటే ఫోన్‌నెంబర్‌తో పాటు మెయిల్ ఐడీ, వ్యక్తిగత వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ పంపిస్తారు. వ్యక్తిగత వివరాల్ని యాడ్ చేసే సమయంలో ఐపీ అడ్రస్ ద్వారా వాటిని దొంగిలించి డైరెక్ట్‌గా యూజర్ అకౌంట్లలో ఉన్న డబ్బును కాజేస్తారు. అంతేకాదు తాము అందించే భారీ గిఫ్ట్‌లు కావాలనుకుంటే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా 70 దేశాల్లో ఒక్కో వినియోగదారు నుంచి ప్రతి నెలా రూ.3100ల వరకూ వసూలు చేస్తారని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ జెడ్‌ల్యాబ్స్ తెలిపింది. 2021లో ఇదే అత్యంత ప్రమాదకరమైన సైబర్ దాడి' అని ఆ సంస్థ వెల్లడించింది.










