ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చిన్న గుంత పడినా కనీసం గంపెడు గ్రావెల్ కూడా వేయని పరిస్థితుల్లో సంబంధిత అధికారులు ఉన్నారు. పట్టణంలో ఉన్న రెండు బ్రిడ్జిలు రోజురోజుకు శిథిలావస్థకు చేరుతున్నాయి. వాటికి పడిన గుంతలు పడడంతో, వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారు. శ్రీనివాస్ భవన్ నుంచి తిమ్మారెడ్డి బస్టాండ్ వరకు ఉన్న పాత బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతం ఆ బ్రిడ్జి ఎప్పుడు కూలుతుందోనన్న భయాందోళన నెలకొంది. రేణుకాంబ హోటల్ పక్కన సైడ్‌వాల్ పూర్తిగా కూలిపోయింది. రైల్వే లైన్ ఉన్న ప్రాంతంలో మాత్రమే బ్రిడ్జికి ఇనుపరాడ్లతో సపోటర్స్ ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతమంతా వదిలేయడంతో వర్షాకాలంలో చిన్నపాటి వర్షం వచ్చినా కింద పడిన దాఖలాలు ఉన్నాయి. అది మరిచి ఎవరైనా నిలిచి ఉంటే తలపై పడి ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉందని పలువురు చెబుతున్నారు. బ్రిడ్జి కింద చిరు వ్యాపారులు నిత్యం వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా, శిథిలావస్థకు చేరిన వాటిని తొలగించి ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కొత్త బ్రిడ్జిపై గుంతలు
విక్టోరియా పేట నుంచి మాధవరం రోడ్డు రెడ్ చిల్లి వరకు కొత్త బ్రిడ్జి వెళ్తొంది. పాత బ్రిడ్జిపై భారీ వాహనాలకు రాకపోకలు లేకపోవడంతో కొత్త బ్రిడ్జిపై వెళ్లే వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బ్రిడ్జిపైన అక్కడక్కడ గుంతలు పడి ఇనుప రాడ్లు కనబడుతున్నాయి. గమనించకుండా వేగంగా వాహనాలు వస్తే అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ద్విచక్ర వాహనాలైతే కింద పడడం ఖాయమని పలువురు వాపోతున్నారు. కనీసం ప్రమాద హెచ్చరికలు కూడా ఏర్పాటు చేయలేదు. రోడ్డుకిరువైపులా విద్యుత్ స్తంభాలు ఉన్నా అక్కడక్కడ లైట్లు వెలగడం లేదు. గ్రావెల్‌తోనైనా గుంతలు పూడ్చాలని పురవాసులు కోరుతున్నారు. త్వరలో జరిగే వినాయక నిమజ్జనానికి వందలాది వాహనాలు ఆ రోడ్డు గుండానే వెళ్లాల్సి ఉంది. అప్పటికైనా మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
కొత్త బ్రిడ్జిపై పడిన గుంత










