ప్రజాశక్తి - వీరఘట్టం : మండలంలోని 12 సచివాలయాలు, 10 రైతు భరోసా కేంద్రాలు, ఏడు వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఈనెల 15 నాటికి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ జిల్లా ఇంజనీరింగ్ శాఖ అధికారి ఎంవిఆర్‌జి కృష్ణాజి జులై 18న స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్ సహాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో హుకుం జారీ చేశారు. అయితే ఎక్కడా ఆ పనులు ప్రారంభం కాలేదు. దీంతో అధికారులు ప్రకటనకే పరిమితమవుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మండలంలో 24 సచివాలయాల పరిధిలో తెట్టంగి గ్రామ సచివాలయం ఒకటే ప్రారంభమైంది. కిమ్మి, తూడి నడిమికెల్లా, కంబర, వండువ గ్రామాల్లో భవన నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక తలవరం, చిదిమి, కత్తుల కవిటి, హుస్సేన్‌పురం, దశమంతపురం, చిట్టిపూడివలస, పనసనందివాడ, వీరఘట్టం-4 గ్రామ సచివాలయాలు ప్లాస్టింగులకు పరిమితం అయ్యాయి. ఇక మండల కేంద్రమైన వీరఘట్టంలోని 2,3 సచివాలయాలు శ్లాబ్‌లకే పరిమితిమయ్యాయి. మిగిలిన సచివాలయాలు ఏళ్లు గడుస్తున్నా పునాదులకు పరిమితమయ్యాయని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలకు వచ్చే సరికి హుస్సేనపురం రైతు భరోసా కేంద్రమే ప్రారంభానికి సిద్ధంగా ఉంది, బిటివాడ, పనస నందివాడ, చిట్టిపూడివలస, వీరఘట్టం, తదితర సచివాలయాలు శ్లాబులకు పరిమితమయ్యాయి. చలివేంద్రి, చిన్న ఘోర కాలనీ, తదితర సచివాలయాలు గ్రౌండ్ లెవెల్‌కే పరిమితమైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ క్లినిక్లకు వచ్చేసరికి వైయస్సార్ హెల్త్ క్లినిక్‌లు వీరఘట్టం తప్ప మిగిలిన చోట్ల బోర్డులకే పరిమితమయ్యాయి. దీంతో సిబ్బంది ఇరుకైన భవనాల్లో, చెట్లు నీడలో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమావేశాలకు పరిమితం కాకుండా భవనాలు పురోగతికి వచ్చేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.










