ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి/హాస్పిటల్
సమస్యలపై పాలకులను ప్రజలు ప్రశ్నించాలని, ఆ విధంగా చైతన్యవంతులు కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి సిపిఎం చేపట్టిన మహా పాదయాత్ర ఐదో రోజు గూడూరు మండలం కె.నాగలాపురంలో ప్రారంభమై పర్ల, సల్కాపురం మీదుగా పెద్దపాడు వరకు సాగింది. ఈ సందర్భంగా పర్లలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు జి.రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సభలో కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధికి సిపిఎం కంకణం కట్టుకుందన్నారు. అనేక మంది పాదయాత్రలు చేశారని, వాటికి, ఈ సిపిఎం పాదయాత్రకు తేడా ఉందని తెలిపారు. వారు అధికారం కోసం పాదయాత్ర చేశారని, సిపిఎం జిల్లా అభివృద్ధి కోసం పాదయాత్ర చేస్తోందని వివరించారు. సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఈ పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. రైతులు, యువత, ప్రజల కోసం ఈ పాదయాత్ర అన్నారు. ఎల్‌ఎల్‌సి కాలువకు నీరు రాకుండా పోయే పరిస్థితి వచ్చిందని, ప్రత్యామ్నాయాల గురించి పాలకులకు పట్టడం లేదని తెలిపారు. రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడం లేదని, కర్నూలు జిల్లా అభివృద్ధికి నోచడం లేదని చెప్పారు. జిల్లా సమగ్రాభివృద్ధికి నాయకులు ఏం చేస్తారో ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పోరాడాలని, ప్రజల కోసం ఆలోచించే నాయకులను కోరుకోవాలని తెలిపారు. ఈ పాదయాత్రకు ప్రజలు మద్దతు తెలపాలని, సోమవారం నిర్వహించే మహా ధర్నాలో పాల్గొనాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయి మాట్లాడుతూ... పర్ల గ్రామంలో పూడ్చడానికి శ్మశాన వాటిక లేకపోవడం దారుణమన్నారు. శ్మశాన వాటికకు స్థలం కేటాయించడానికి ప్రభుత్వానికి చేత కాదా అని ప్రశ్నించారు. ఈ సమస్యపై రాబోయే రోజుల్లో కలిసి కట్టుగా పోరాటం సాగించాలన్నారు. జిల్లాలో తక్షణమే ప్రాజెక్టులు కట్టాలని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లను కేటాయించాలని కోరారు. సల్కాపురంలో టిడిపి నాయకులు దేవేంద్ర రెడ్డి, సిపిఎం నాయకులు స్వాగతం పలికారు. పాదయాత్ర ఉద్దేశాన్ని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి.నరసింహా వివరించారు. అనంతరం పెద్దపాడులో సిపిఎం నాయకులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. పెద్దపాడులో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయి మాట్లాడారు. అనంతరం పాదయాత్ర తాజ్ ఫంక్షన్ హాల్ వరకు సాగింది. పాదయాత్రలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్.రాధాకృష్ణ, కెవి.నారాయణ, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నేడు మహా ధర్నా
సిపిఎం చేపట్టిన మహా పాదయాత్రలో భాగంగా సోమవారం మహా ధర్నా చేపట్టనున్నారు. ఉదయం తాజ్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కర్నూలు నగరం గుండా సాగుతూ కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నారు. ఈ మహా ధర్నాకు సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు హాజరు కానున్నారు.










