ప్రజాశక్తి-ఆలూరు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తున్నందున గ్రామ, పట్టణ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ రామాంజనేయులు సూచించారు. బుధవారం కలెక్టర్ సృజన ఆదేశాల మేరకు గుంతకల్ రోడ్డులోని ప్రమాదకరమైన కళ్లి వంకను తహశీల్దార్, డిటి విజరు కుమార్, ఆర్‌ఐ బసవన్న గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో కళ్లి వంక ఉధృతంగా ప్రవహించే సమయంలో వంకను దాటుతూ కొందరు ప్రయాణికులు మృతి చెందగా, కార్లు, బైక్‌లు కొట్టుకు పోయిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. చిన్న వంక, పెద్ద వంక అయినా నీటి ఉధృతి తగ్గిన తర్వాతే వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు దాటాలని సూచించారు. గ్రామ, పట్టణాల్లో పాత ఇళ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు గ్రామస్థాయి అధికారులకు అదేశాలిచ్చామని తెలిపారు. ప్రజలు సహకరించి మట్టి మిద్దెలో, వాగులు, వంకల దగ్గర జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిప్పగిరి తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ లక్ష్మినారాయణ విలేకరులతో మాట్లాడారు. పది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మట్టి మిద్దెల్లో నివసిస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లోనూ అధిక వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, ఇప్పటికే మట్టి మిద్దెలు పూర్తిగా తడిసి ఉంటాయని చెప్పారు. ముందు జాగ్రత్తలు తీసుకొని బంధువులు ఇంట్లో, మరో ప్రాంతంలోనైనా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు పడే సమయంలో విద్యుత్ స్తంభాల దగ్గర, కూలడానికి సిద్ధంగా ఉన్న మిద్దెల దగ్గర ఉండకూడదన్నారు. రైతులు పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టేస్తుంటారని, ఇది చాలా ప్రమాదకరమని, అలా చేయవద్దని సూచించారు. మట్టి మిద్దెలు కూలిన వారు సంబంధిత రెవెన్యూ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలన్నారు.
గుంతకల్ రోడ్డులోని కళ్లి వంకను పరిశీలిస్తున్న అధికారులు










