Jul 11,2023 21:40

విద్యుత్‌ అధికారులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

       ధర్మవరం టౌన్‌ : ప్రజలపై విద్యుత్‌ బారాలు మోపొద్దని సిపిఎం నాయకులు విద్యుత్‌ అధికారులను కోరారు. ధర్మవరం మార్కెట్‌ యార్డ్‌ సమీపంలోని సబ్‌ స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు, సిపిఎం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, ఎస్‌హెచ్‌.బాషా, సిపిఎం పట్టణ కార్యదర్శి నామాల నాగార్జున, నాగేంద్ర సిఐటియు ఆదినారాయణ తదితరులు విద్యుత్‌ అధికారులను కలిసి మాట్లాడారు. ధర్మవరంలో చేనేత, పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలపై మూడు కిలో వాట్స్‌ పేరుతో అదనంగా 6250 రూపాయలు వసూలు చేయడం సరైనది కాదన్నారు. గతంలో ఉన్న విధంగా 1 కెడబ్ల్యుకు రూ.1800 ప్రకారం బిల్లులు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలన్నారు. దీనిపై విద్యుత్‌ అధికారులు స్పందిస్తూ ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.