ప్రజాశక్తి బత్తలపల్లి : ప్రభుత్వ అధికారులను అడ్డంపెట్టుకుని అధికారంలో వున్నామన్న ధీమాతో పేద ప్రజలను అణచి వేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. మండలంలోని పోట్లమర్రి గ్రామంలో వైసిపి నాయకులు హనుమంతురెడ్డి ఇంటికి రోడ్డు వేయాలని బలహీన వర్గాలకు చెందిన వ్యక్తికి చెందిన గుడిసెను పాక్షికంగా తొలగిచడంతో బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ పొట్లమర్రి గ్రామానికి చేరుకుని బాధితుడితో మాట్లాడారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరాం మాట్లాడుతూ గతంలోనూ గుడిసెను కూల్చేందుకు ప్రయత్నించగా బాధితుడు రెవెన్యూ అధికారులకు, పోలీసులకు చెప్పినా ఫలితం లేదన్నారు. కోర్టుకు వెళితే కేసు కట్టారన్నారు. అయినా మరోసారి దౌర్జన్యంగా గుడిసెను కూల్చి రోడ్డు వేయాలని ప్రయత్నించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉంది కాదా అనిపేదలను అణచివేయాలని చూస్తే వారిలో తిరుగుబాటు మొదలవుతుందన్నారు. అధికారులు కూడా పాలక వర్గ నాయకులకే మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. వైసిపి నాయకుల మాటలు విని ఎక్కడో గుజరాత్‌లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్న వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళితే న్యాయం జరుగుతుందనే మాట పక్కనపెడితే తమకు అన్యాయం జరుగుతుందన భావన ప్రజల్లో వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడో జరిగే విషయాలు మాట్లాడే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ధర్మవరానికి కూతవేటు దూరంలో వున్న పోట్లమర్రిలో జరుగుతున్న ఈ దౌర్బన్యం గురించి తెలియదా అని ప్రశ్నించారు. వైసిపి నాయకులకు ఆయన వత్తాసు పలుకుతున్నారన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే ప్రైవేటు కేసులు వేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అంతకు ముందు బాధితుని స్థలానికి హద్దులు ఏర్పాటు చేసి బండలు పాతించారు. అనంతరం బాధితులతో కలసి ధర్మవరం ఆర్డీవోను కలసి గ్రామంలో పరిస్థితిని వివరించారు. బాధితులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజవర్గం ఆర్‌టిఎస్ కోఆర్డినేటర్ బోయపాటి అప్పస్వామి నాయుడు, జగ్గు, మందల శ్రీనివాస్, రామాపురం కేశవ, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










