Oct 07,2023 21:32

సీతంపేట.. సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వి.కళావతి

ప్రజాశక్తి-సాలూరు :  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిప్యూటీ సిఎం రాజన్నదొర.. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గృహసారథులకు సూచించారు. రాష్ట్రానికి మళ్ళీ జగనన్నే సిఎం కావాల్సిన అవసరం గురించి ప్రజలకు వివరించాలని కోరారు. శనివారం పట్టణంలోని శివాలయ వీధిలో ఉన్న సీతారామ ధర్మశాలలో నిర్వహించిన వైసిపి మండల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలనేది విపులంగా చెప్పాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బేరీజు వేసుకుని తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించాలని సూచించారు. సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, జెసిఎస్‌ కన్వీనర్లతో స్థానిక సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ఇతర నాయకులు ఈ బాధ్యతలు నిర్వహించాలన్నారు. ఈ నెల 9న విజయవాడలో నిర్వహించనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి గ్రామ, పట్టణ, మండల, జిల్లా నాయకులు శ్రేణులంతా హాజరు కావాలని కోరారు. ఈ సమావేశం తర్వాత పల్లెకు పోదాం అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. సచివాలయాల పరిధిలో పేదల సమస్యలను తెలుసుకుని రాత్రిపూట అక్కడే బస చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి, ఎఎంసి చైర్‌ పర్సన్‌ దండి అనంతకుమారి, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, సువ్వాడ గుణవతి, వైసిపి మండల అధ్యక్షులు సువ్వాడ భరత్‌, శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సీతంపేట : సీతంపేటలో ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి కార్యక్రమంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి.కళావతి మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి ఆదినారాయణ, వైస్‌ ఎంపిపిలు సరస్వతి పాల్గొన్నారు.