Sep 17,2023 20:54

ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌కు బొకే అందజేస్తున్న దృశ్యం

        ప్రజాశక్తి-అనంతపురం క్రైం    సమిష్టిగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ పిలుపునిచ్చారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆదివారం జిల్లాలోని అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఇతర పోలీసు అధికారులతో స్థానిక పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పారదర్శక, నిష్పక్షపాతంగా పని చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, బాడిలీ అఫెన్స్‌, దొంగతనాలు వంటి వాటిపై ప్రాధాన్యతా క్రమాన్ని గుర్తించి నివారించాలన్నారు. జిల్లాలో మట్కా, పేకాట ఉండకూడదన్నారు. సిబ్బంది అవినీతికి దూరంగా ఉండాలన్నారు. కీలక కేసులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో వేగవంతంగా ట్రయల్స్‌ జరిపించి నిందితులకు శిక్షలు పడేందుకు కృషి చేయాలని సూచించారు. దీనికి డీఎస్పీల మానిటరింగ్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. డయల్‌ 100కి వచ్చే కాల్స్‌పై వేగవంతంగా స్పందన ఉండాలన్నారు. నిర్ణీత సమయంలో నేర స్థలానికి చేరుకుని బాధితులకు ఊరట కల్పించాలన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లను సందర్శిస్తానన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, గంజాయి కేసుల్లోని నిందితుల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీసుస్టేషన్లకు వచ్చే మహిళలు, ప్రజల పట్ల గౌరవంగా వ్యవహరించాలన్నారు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న వినాయక చవితి పండుగ, నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఆర్‌.విజయభాస్కర్‌రెడ్డి, జి.రామకృష్ణ, ఏ.హనుమంతు (ఏఆర్‌), డీఎస్పీలు బి.శ్రీనివాసులు, సీఎం గంగయ్య, యు.నరసింగప్ప, జి.ప్రసాదరెడ్డి, బీవీ శివారెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.