Jul 25,2023 22:05

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : రెవెన్యూ, పోలీసు, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో సమిష్టిగా పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దామని అనంతపురం రేంజ్‌ డిఐజి ఆర్‌ఎన్‌.అమ్మిరెడ్డి , జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు, జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పుట్టపర్తి లోని సాయి ఆరామం లోని ఫంక్షన్‌ హాలులో అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా డిఐజి మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ఇతర ప్రభుత్వ శాఖలలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. నేరాల్లో పాలు పంచుకున్న వారు ఎవరైనా ఎంతటి వారైన సరే చట్టం ద్వారా వారికి శిక్ష పడేలా దర్యాప్తు చేయాలని అన్నారు. పలు కేసులలో పై కోర్టు లు ఇస్తున్న తీర్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా తరువాత కేసులలో ముందుకు సాగాలని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిబ్బంది అందరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు.కలెక్టర్‌ అరుణ్‌ బాబు మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ, పోలీసు శాఖలు మంచి సమన్వయంతో ముందుకెళ్తుండటం శుభపరిణామని అన్నారు. పోలీసు అధికారులు జిల్లా సరిహద్దు గ్రామాల్లో పల్లె నిద్రలు చేసేటప్పుడు లేదా గ్రామాల సందర్శన సమయంలో స్థానిక సమస్యలపైనే కాకుండా బాల్య వివాహాలపై అవగాహన పెంచాలని సూచించారు. ఫోక్సో కేసుల్లోని బాధితురాళ్లకు పునరావాసంతో పాటు విద్యాభ్యాసం కొనసాగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీస్‌ సిబ్బంది హైవే అథారిటీ వారితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ప్రజలలో పోలీసుల పట్ల విశ్వాసం పెంపొందేలా మెలగాలని కోరారు. రౌడీ షీటర్లు పాత నేరస్తులపై నిఘా కొనసాగించాలని అనుమానాస్పదతో మృతి చెందిన కేసులలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్‌ సిబ్బందికి డిఐజి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ .విష్ణు, జిల్లా పరిధిలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలతో పాటు రవికుమార్‌, ఆర్టీవో సురేష్‌ సిబ్బంది పాల్గొన్నారు.