సోమందేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేలా ప్రారంభించిన జగనన్న సురక్ష కార్యక్రమం కింద సర్వీస్‌ల నమోదు మరింత పెంచాలని కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. మంగళవారం నాడు సోమందేపల్లి మండలంలోని వెలుగమేకలపల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్‌తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్ల సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం పరిధిలో వాలంటీర్లు ఇంటింటికీ ఖచ్చితంగా తిరగాలన్నారు. రిక్వెస్ట్‌లు ఇక్కడ తక్కువగా ఉన్నాయని రిక్వెస్ట్‌లను మరిన్ని పెంచాలన్నారు. అర్హత ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే అలాంటి వారికి లబ్ధి చేకూర్చాలని, ఆగస్టులో ఇచ్చే ద్వైవార్షిక నగదు పంపిణీలో పథకాల లబ్ధి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం సాయంత్రం వేళ ఇంటింటికీ వెళ్లి జగనన్న సురక్ష సర్వేను పూర్తి చేయాలన్నారు. గ్రామంలో హౌస్ హోల్డ్ సర్వే 660 పూర్తి చేయగా, సర్వీస్‌ల నమోదు ఎక్కువగా జరగలేదని, మరిన్ని సర్వీసులను నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం ఉచతంగా అందించే 11 రకాల సేవలను ఇంటింటా తెలియ జేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










