ప్రజాశక్తి - హోళగుంద
ప్రజల ప్రభుత్వం వైసిపి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. శనివారం మండలంలోని కోగలతోట గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు కోసమే వైసిపి ప్రభుత్వం పని చేస్తోందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్నారని తెలిపారు. మహిళలకు సామూహిక మురుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిసి రోడ్లు, డ్రెయినేజీల కోసం రూ.30 లక్షలు ముంజూరు చేశారు. జల జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ఆలూరు ఎస్‌ఐ డాక్టర్ నాయక్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసిపి తాలూకా బాధ్యులు నారాయణస్వామి, మాజీ సర్పంచి వెంకటేష్, సర్పంచి నాగప్ప, వైసిపి మండల కన్వీనర్ షఫీవుల్లా, ఎంపిపి తనయుడు ఈషా, వైసిపి నాయకులు శేషప్ప, ఎంపిటిసి ఉరుకుందప్ప, గుబ్బలి లక్ష్మయ్య పాల్గొన్నారు.










