ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ప్రజల ముంగిటకే వైద్య సేవలను తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందని మేయర్ మహమ్మద్ వసీం తెలిపారు. మంగళవారం నగరంలోని 38వ డివిజన్ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి వాకబు చేసి, ముందస్తుగానే వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికే 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈకార్యక్రమంలో భాగంగా 45 రోజుల వ్యవధిలో హెల్త్‌క్యాంపులు, వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నెల రోజులపాటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రాథమికంగా ఏడు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అర్బన్ హెల్త్‌సెంటర్లలో 64 రకాల పరీక్షలు నిర్వహించి 172 రకాల మందులను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షల తర్వాత అవసరమైతే ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రుల్లో మైరుగైన వైద్యసేవలు కూడా అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అనిల్‌కుమార్‌రెడ్డి, సైఫుల్లా, హెల్త్ ఆఫీసర్ గంగాధర్‌రెడ్డి, డాక్టర్ రోహిత్, సచివాలయ ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలతో మాట్లాడుతున్న మేయర్ వసీం










