May 16,2023 22:07

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

      పుట్టపర్తి అర్బన్‌ : ప్రజల భాగస్వామ్యం ద్వారానే డెంగీ వ్యాధిని నియంత్రించ వచ్చని కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జాతీయ డెంగీ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణపై జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డెంగీ వచ్చేందుకు గల కారణాలు తెలుసుకుని, వాటి నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలు గురించి ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. దోమలు సంతానోత్పత్తి చేసేందుకు వీలులేకుండా కచ్ఛితంగా పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలన్నారు. వారంలో రెండు పర్యాయాలు పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వైద్యశాఖ ఆధ్వర్యంలో ముద్రించిన వివిధ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ ఎస్‌వి.కష్ణారెడ్డి, పుట్టపర్తి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరామరెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ రామాంజనేయులు, డీఈవో మీనాక్షి, ఐసిడిఎస్‌ పీడీ లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు.