ప్రజాశక్తి కథనానికి స్పందన
నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణంపై వివరణ కోరిన కలెక్టర్
ప్రజాశక్తి - పాములపాడు
ప్రజాశక్తి దినపత్రికలో ఈ నెల 21న 'దళిత గ్రామంపై వివక్ష' శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ స్పందించారు. పాములపాడు మండలం జూటూరు మజరా కోల్స్ ఆనందపురం గ్రామానికి వెళ్లే కెసి కెనాల్ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడంపై సంబంధిత ఇరిగేషన్, కెసి కెనాల్ అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు. తక్షణమే సమస్య పరిష్కారానికి నివేదికలు పంపించాలని ఆదేశించారు. అలాగే రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు సిఎం ఆఫీస్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి కోల్స్ ఆనందపురం బ్రిడ్జిపై ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. కెసి కెనాల్ ఏఇఇ శ్రీనివాసనాయక్ కోల్స్ ఆనందపురానికి చేరుకొని శిధిలావస్థలో ఉన్న బ్రిడ్జిని, నిర్మాణం మధ్యలో ఆగిన పిల్లర్స్‌ను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి ఫిర్యాదుదారుడు వెంకటేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి సామన్న, గ్రామ నాయకులు మదిలేటి, ఉపేంద్ర, కోల్స్ ఆనందపురం గ్రామస్తులు చంద్రపాల్, యోహాను, దానమయ్య, గ్రామ పెద్దలతో మాట్లాడి త్వరలోనే బ్రిడ్జి మంజూరు అవుతుందని, ప్రతిపాదన పంపామని తెలిపారు.











