Oct 08,2023 21:30

చర్చావేదికలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌

ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్‌ : ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ తెలిపారు. అనంతపురం నగరంలోని ఐఎంఎ హాల్‌లో 'ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అనే' అంశంపై ఆదివారం ఏర్పాటు చేసిన చర్చా వేదికకు పలు సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. ప్రజారోగ్య వేదిక ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ కొండయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధికంగా నిధులు కేటాయించి మెరుగైన వైద్యం క్షేత్రస్థాయిలో అందేలా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రభుత్వం సిహెచ్‌లు, పిహెచ్‌సిలు, ఏరియా ఆసుపత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు పటిష్ట పరుస్తూ సామాన్య పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం చేరువయ్యేందుకు కృషి చేయాలన్నారు. విద్య వైద్య రంగాల్లో పూర్తిస్థాయి ప్రభుత్వ భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్‌ కొండయ్య మాట్లాడుతూ ప్రజారోగ్య వేదిక ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజలకు క్షేత్రస్థాయిలో వైద్యం అందేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సుమారుగా 16 మండలాలు, మూడు పట్టణాల్లో ప్రజారోగ్య వేదిక ద్వారా సర్వే చేసి ప్రజాభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. మూడు క్యాటగిరీలుగా చేసిన ఈ సర్వేలో ప్రజలు 75శాతం విద్య వైద్యానికి ఖర్చు చేస్తున్నట్లు తెలియవచ్చిందన్నారు. ప్రజారోగ్య వేదిక కార్యదర్శి శ్రీనివాస రావు మాట్లాడుతూ అనంతపురం సర్వజన ఆసుపత్రి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు వైద్యం అందుతుందని తెలిపారు. నేడు వైద్యం ఖరీదైన వస్తువుగా మారిందని ప్రభుత్వం ఆలోచించి పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ ప్రసూన మాట్లాడుతూ వైద్య రంగంలో ముఖ్యంగా ప్రభుత్వ వైద్య సేవల విషయంలో లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిధుల లేమి పేరుతో ప్రజలకు సేవలు అందించకుండా దాటవేత ధోరణితో ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదన్నారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ వీరభద్రయ్య మాట్లాడుతూ ప్రజారోగ్యం ప్రటిష్ట పరిచేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విధానాలను పరిశీలించి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ శంకర్‌, సామాజికవేత్త నబిరసూల్‌, రామకృష్ణ, ఎల్‌ఐసి నాయకులు రామకృష్ణ, విద్వాన్‌ విశ్వం విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ రాజమోహన్‌, జాయింట్‌ కన్వీనర్‌ ఎంఎన్‌టి రాజు, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ సిబ్బంది రాయుడు, యుటిఎఫ్‌ నాయకులు జిలాన్‌, ఎపిఎంఎస్‌ఆర్‌యు రాజేష్‌, పలు సంఘాల ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.