ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్:బాల్య వివాహాలు పూర్తి నిర్మూలనలో ప్రజా ప్రతినిధుల అండదండలు తప్పనిసరని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు సీతారాం తెలిపారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో నిర్మూలన జరగాలంటే ప్రజాప్రతినిధుల పాత్ర శత శాతం అవసరం ఎంతైనా ఉందని సీతారాం అన్నారు.స్థానిక ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఐసిడియస్ నర్సీపట్నం చైల్డ్ డెవలప్మెంట్ ప్రోజెక్ట్ ఆఫీసర్ మేరీ సువార్త నేతృత్వంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, కైలాస్ సత్యార్థి ఫౌండేషన్, జిల్లా బాలల సంరక్షణ విభాగం, పోలీసు, విద్యా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. సీడ్ సంస్థ బాల్య వివాహాలపై రూ పొందించిన వాల్ పోస్టర్లను సీతారాం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాల్లోనూ అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంలో వివిధ కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది ఆగస్ట్‌లోనే జిల్లా వ్యాప్తంగా 21 బాల్య వివాహాలు నిలుపుదలలో కృషి చేసిన అధికారులను ప్రశంసించారు.బాల్య వివాహాలను ఆపిన అనంతరం సంబందిత బాలికలు ఎక్కడున్నారో పర్యవేక్షణ చేసి అవసరం అయితే మళ్లీ మాట్లాడాలన్నారు. ఇందుకు స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలు తీసుకుని గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, వార్డుల అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు, అధికారులు ప్రత్యేక దృష్టితో చర్యలు చేపట్టాలని సూచించారు.
నర్సీపట్నం మునిసిపల్ ఛైర్పర్సన్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ, మునిసిపల్ కౌన్సిల్ పరిధిలోని కౌన్సిలర్లు బాల్య వివాహాల్లో పాల్గొనకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. బాల్య వివాహ రహిత మునిసిపాలిటీగా పేరు ప్రఖ్యాతలు తెస్తామన్నారు.
ఎంపిపి సుర్ల రాజేశ్వరి మాట్లాడుతూ మండల స్థాయిలో అంగన్వాడీ వర్కర్, గ్రామ సర్పంచ్ లు, ఎంపిటిసి, అధికారులు బాల్య వివాహాల నిర్మూలనకు సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఐసిడిఎస్ నర్సీపట్నం సిడిపిఒ కె.మేరీ సువార్త మాట్లాడుతూ, అన్ని శాఖల సమన్వయంతో బాల్య వివాహాల నిలుపుదలకు సమాజంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.పౌష్టికాహార స్టాల్స్ ను ఐసిడిఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నర్సీపట్నం మునిసిపల్ వైస్ ఛైర్మన్ కోనేటి రామకృష్ణ, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, వైస్ ఎంపీపీ రత్నం, తహశీల్దార్ అన్నాజీరావు, మునిసిపల్ కమిషనర్ కనకారావు, ఎంపిడిఓ.జయ మాధవి, సబ్ ఇన్స్పెక్టర్ ధనుంజరు ,సీడ్ స్వచ్చంద సంస్థ కార్యదర్శి సన్యాసి రాజు నర్సీపట్నం, మాకవరపాలెం మండలాల విద్యాశాఖాధికారులు తలుపులు, పి.ఎస్.ఎన్.మూర్తి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










