Oct 15,2023 00:31
మేము సైతం బాబుతో కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి

ప్రజాశక్తి-హనుమంతునిపాడు: జగన్మోహన్‌ రెడ్డి చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని, ఆయన సంగతిని ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటా మని మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. హనుమంతునిపాడు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో 'మేము సైతం బాబుతో' కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచుతూ గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో రూ.27 కోట్ల అవినీతి జరిగిందని సిఐడి అధికారులు అంటున్నారని, తెలుగుదేశం పార్టీ ఎకౌంట్‌కు జమ అయిన ఆ మొత్తం పార్టీకి విరాళాల రూపంలో వచ్చాయని అన్నారు. అయితే వైసిపి పార్టీ ఎకౌంటుకు 300 కోట్ల రూపాయలు పైబడి డబ్బులు ఏ విధంగా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నిటికీ విరాళాలు వస్తాయని అలా అయితే అన్ని పార్టీలు అవినీతికి పాల్పడ్డట్టేనని వైసిపి నాయకులు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫైబర్‌ గ్రిడ్‌ను రూ.320 కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటు చేశారని, దానిమీద రూ.900 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని, ఇక అవినీతికి ఆస్కారం ఎక్కడని ప్రశ్నించారు. అయినా అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక కృష్ణా నది జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తూ తెలంగాణకు అనుకూలంగా నీటి కేటాయింపులు చేపట్టారని అన్నారు. వైసిపి నాయకులు కోడి కత్తి కేసు, వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వానికి సాగిలపడ్డారని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి గాయం తిరుపతిరెడ్డి, గాయం రామిరెడ్డి, చీకటి వెంకటసుబ్బయ్య, మురహరి నర్సయ్య, బ్రహ్మం గౌడ్‌, మువ్వా రంగసాయి, గంగిరెడ్డి రమేష్‌రెడ్డి, మాసిపోగు ఎర్రయ్య, కోటపాటి శేషయ్య, కందుల వెంకటసుబ్బారెడ్డి, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.