ప్రజాశక్తి-రాయదుర్గం ప్రజాధనం లూటీ చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని.. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుతో నిరూపితం అయిందని విప్ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు కక్షపూరితం కాదన్నారు. ఇది వైసిపి విజయం కాదని, ప్రజా విజయంగా భావించాలన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. ప్రజాధనం లూటి సాక్షాధారాలతో నిరూపితం అయిందని, అయితే దొంగ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారం ఉందన్నారు. చంద్రబాబు తప్పు చేసి అడ్డంగా ఇరుక్కుని అన్ని సాక్షాధారాలతో ఉన్నప్పటికీ అతడి తరపు లాయర్లు అడ్డంగా వాదిస్తున్నట్లు చెప్పారు. సీమెన్స్ సంస్థతో రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఆ సంస్థ స్పష్టం చేసిందన్నారు. అందులో పనిచేసే ఒక వ్యక్తితో ఒప్పందం తీసుకుని బినామీ సంస్థల పేరిట నిధులు మళ్లించి నిధులు డ్రా చేసినట్లు వెల్లడైందన్నారు. సిమెన్స్ వాణిజ్య సంస్థ కాగా 90 శాతం గ్రాంటును ఆ సంస్థ ఎందుకు ఇస్తుందన్నారు. చంద్రబాబు నమ్మకద్రోహి అని, తాను చేసిన ప్రమాణాన్ని, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారన్నారు. చంద్రబాబు న్యాయవాదుల వాదనలు సాక్షాలు ఆధారాల ముందు నిలవలేదన్నారు. బాబు స్వయంగా వాదించుకున్నా ఎలాంటి ఫలితం ఉండదన్నారు. ఆయన టెక్నికల్ రీజన్ పేరిట కేసు మళ్లించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. హెలిక్యాప్టర్‌లో జైలుకు తీసుకెళ్తామంటే.. వద్దు చంపుతారని భయం వ్యక్తం చేయడంతోపాటు రోడ్డుపై తీసుకెళ్తే హంగామా చేయవచ్చని, పబ్లిసిటీ పొందవచ్చని టిడిపి నేతల ఆలోచన అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి అక్కర్లేదన్నారు. చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీ చేసిన మాట వాస్తవమని, ఆధారాలు ఉన్నాయని, తప్పు చేస్తే చర్య తప్పదని అందులో భాగమే చంద్రబాబు అరెస్టు అన్నారు. ప్రజలు చంద్రబాబు మనస్తత్వాన్ని గుర్తించాలన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో కేసీఆర్ కాళ్లు పట్టుకుని తెలంగాణ రాష్ట్రం వదిలి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారన్నారు. జయలలిత, లాలూప్రసాద్ మాదిరి చంద్రబాబు కూడా తన శేష జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉందని ఎద్దేవా చేశారు. ఆయనపై ఉన్న కేసులు పరిష్కరించేలోగా ఆయన చావు తప్పదన్నారు. ఇప్పటికైనా టిడిపి కార్యకర్తలు చంద్రబాబు తప్పుడు మాటలు విని మోసపోకుండా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, రాయదుర్గం పురపాలక సంఘ అధ్యక్షులు పోరాళు శిల్ప, ఉపాధ్యక్షులు వలిబాషా, శ్రీనివాస్‌యాదవ్, మాజీ అధ్యక్షులు గౌని ఉపేంద్రరెడ్డి, జడ్పిటిసి మహేష్, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు రాళ్ల తిమ్మారెడ్డి, రాయదుర్గం పట్టణ కన్వీనర్ ముస్తాక్, గుమ్మగట్ట మండల కన్వీనర్ మంజునాథ, మున్సిపల్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న విప్ కాపు రామచంద్రారెడ్డి










