Jul 26,2023 19:17

సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకుంటున్న గుమ్మనూరు జయరామ్‌

ప్రజాశక్తి - దేవనకొండ
ప్రజా సంక్షేమమే వైసిపి ధ్యేయమని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ తెలిపారు. బుధవారం మండలంలోని గుండ్లకొండ, ఎంకె.కొట్టాల గ్రామాల్లో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మనూరు హాజరయ్యారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని తెలిపారు. పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించినట్లు చెప్పారు. సచివాలయ, వాలంటీరు వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన తెచ్చిన ఘనత జగన్మోహన్‌ రెడ్డికే దక్కిందని తెలిపారు. గుండ్లకొండ పంచాయతీలోనే ఇప్పటివరకు అర్హత ఉన్న వారందరికీ వివిధ సంక్షేమ పథకాలతో సుమారు రూ.7.75 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. గ్రామంలో రూ.10 లక్షలతో మెయిన్‌ రోడ్డు, రూ.10 లక్షలతో డ్రెయినేజీ కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ స్వామి, జడ్‌పిటిసి కిట్టు, ఎంపిపి భర్త లుముంబా, వైసిపి మండల కన్వీనర్‌ కప్పట్రాళ్ల మల్లికార్జున, సర్పంచి షేక్‌ కాసింబీ, ఆమె కుమారుడు, వైసిపి నాయకులు గఫూర్‌ పాల్గొన్నారు.