Oct 13,2023 18:19

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
   ప్రజా సంక్షేమమే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని పోలవరం నియోజకవర్గ ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు పేర్కొన్నారు. శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అంకన్నగూడెం పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ఒక్క వైసిపి ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. పేద ప్రజల సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గ్రామాల్లోని పలు సమస్యలను ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకువచ్చారు. అంకన్నగూడెం మీదుగా ఆర్‌టిసి బస్‌ సౌకర్యం ఉండేదని, దాన్ని నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలపగా వెంటనే జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి బస్‌ సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నూతన సచివాలయ భవనాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కోర్స పోసమ్మ, జెడ్‌పిటిసి వసంతరావు, సర్పంచులు పైదా ముత్యాలమ్మ, సున్నం వరలక్ష్మి, వైస్‌ ఎంపిపి సోమగాని శ్రీనివాస్‌, మండల పార్టీ అధ్యక్షులు సందా ప్రసాద్‌, ఎఎమ్‌సి డైరెక్టర్‌ బోదా శ్రీనివాస్‌ రెడ్డి, సచివాలయ కన్వీనర్‌ వనమా రామకృష్ణ, గాంధీ, తహశీల్దార్‌ సుందర్‌ సింగ్‌, ఎంపిడిఒ కృష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు.