ప్రజాశక్తి - హాలహర్వి
ప్రజా సంక్షేమం కోసమే 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. బుధవారం మండలంలోని మజరా గ్రామమైన సిరిగాపురంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి జయరామ్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్రాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన 'గడపగడపకు మన ప్రభుత్వం' ప్రజాదరణ పొందుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏయే స్థాయిలో, ఏయే వర్గాలకు అందుతున్నాయో అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముందుగా గ్రామ చింతకుంట నుంచి సిరిగాపురం గ్రామానికి బిటి రోడ్డు వేయాలని ప్రజలు మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ... రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. ఎంపిపి నెట్టికంటమ్మ, జడ్‌పిటిసి లింగప్ప, వైసిపి మండల కన్వీనర్ భీమప్ప చౌదరి ఎంపిడిఒ ఆంథోని పాల్గొన్నారు.
మంత్రి జయరామ్‌ను సన్మానిస్తున్న నాయకులు










