ప్రజాశక్తి-ఆదోనిరూరల్
మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి కె.లింగన్న, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి.వీరారెడ్డి, రామాంజనేయులు కోరారు. సోమవారం సిపిఎం ప్రతినిధి బృందం సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలంలో నేమకల్లు ఎస్‌ఎస్ ట్యాంకు నుంచి ఒకే పైపులైన్ ద్వారా 16 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారని తెలిపారు. మధ్యలో పైపులైన్ మరమ్మతులకు రావడంతో ఆ గ్రామాలకు వారం నుంచి పది రోజుల పాటు నీరందే అవకాశం లేదని చెప్పారు. వెంటనే రెండో పైపులైన్ ఆరెకల్ వరకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గనేకల్ గ్రామంలో శ్మశానానికి వెళ్లాలంటే రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తోందని, ప్రమాదాలు జరిగిన ఘటనలూ ఉన్నాయని తెలిపారు. శ్మశానానికి రస్తా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కుప్పగల్లు గ్రామంలో శ్మశానం ఏర్పాటు చేయాలని కోరారు. పెద్దతుంబలం గ్రామంలో 11కెవి విద్యుత్ తీగలు మిద్దెలకు ఆనుకుని వెళ్లాయని, వాటిని మార్చాలని కోరారు. మదిరే గ్రామంలో 2001లో ఇచ్చిన పట్టాల లబ్ధిదారులకు ఇంటి స్థలం చూపించాలని డిమాండ్ చేశారు. ఇస్వి, జాలమంచి, నాగలాపురం, పాండవగల్ నుంచి కుప్పగల్ స్టేషన్ వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, గనేకల్ జగనన్న కాలనీ పక్కన వంకపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిపిఎం శాఖ కార్యదర్శి పరమేష్, పార్టీ సభ్యులు ఆయన్న, కార్యకర్తలు సిద్ధు, హనుమంతు పాల్గొన్నారు.
వినతిపత్రం అందజేస్తున్న నాయకులు










