Aug 25,2023 21:20

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుసుబ్బరావమ్మ

బెలగాం: కేంద్రంలో మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని గద్దిదించేందుకే దేశంలో సిపిఎం సమరభేరి యాత్రను చేపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ చెప్పారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సిపిఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు ప్రజల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 30 నుండి సెప్టెంబర్‌ 4 వరకు సమరభేరి యాత్రను చేపడుతున్నామన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చేముందు ఒక మాట, వచ్చాక రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలు శరవేగంగా అమలు చేయడంలో ముందు ఉందన్నారు. దీంతో పాటు మతోన్మాదాన్ని ప్రజల్లో ప్రేరేపిస్తూ విభజించు పాలించే ధోరణిలో ప్రజలకు తీవ్ర నష్టం చేస్తుందని విమర్శించారు. మణిపూర్‌లో ఉన్న డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్ల స్త్రీలకు సంరక్షణ లేదని, వారిని వివస్త్రాలు చేసి ఊరేగింపు సంఘటన ప్రపంచమే తలదించుకునే పరిస్థితులు బిజెపి వల్ల వచ్చాయని అన్నారు. అందుకే స్త్రీలకు రక్షణ కల్పించే చట్టాలను తీసుకురావాలని, మణిపూర్‌ సిఎం వీరేంద్రసింగ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా యన్నారు. ప్రపంచంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టినా దేశం, రాష్ట్రంలో మాత్రం డీజిల్‌, పెట్రోల్‌ ధరలు ఇష్టానుసారంగా పెంచుకుపోతున్నార న్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నారని, తీరా కోటి ఉద్యోగాలు కాదు కాదా కోటి యాభై లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటుపరం చేసి నిరుద్యోగాన్ని, మతోన్మాదాన్ని బిజెపి పెంచి పోషిస్తుండడం భవిష్యత్తులో ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తారన్నారు. వ్యవసాయ కార్మికులకు పని భద్రత కల్పించాలని యుఎపి హయాంలో సిపిఎం ఒత్తిడి మేరకు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొస్తే ఇప్పుడు బిజెపి ఆ చట్టానికి తూట్లు పొడుస్తుందని విమర్శించారు. జిల్లాలో జూట్‌, సుగర్‌ ఫ్యాక్టరీ మూతపడ్డాయన్నారు. విద్యుత్‌ సంస్కరణలు వచ్చిన తర్వాత ప్రజలపై భారాలు పెరగడమే కాకుండా ఫ్యాక్టరీలు కూడా మూతపడి ప్రజలకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఉత్తరాంధ్రాకు ఆశాజ్యోతిగా ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయొద్దని 900 రోజుల నుండి కార్మికులు పోరాడుతుంటే రాష్ట్రంలో వైసిపి, ప్రతిపక్షమైన టిడిపి, జనసేన ఏ ఒక్కరూ దీన్ని వ్యతిరేకించడంలేదన్నారు. పట్టణాల్లో సంస్కరణలు తీసుకొచ్చి చెత్త పన్ను, ఆర్థిక పన్నులు, భారాలు పెట్టి పట్టణ వాసులను ఇబ్బంది పెడుతున్నారని అందుకు ఈ డిమాండ్లన్నీ పరిష్కారం కావాలని సమరభేరి యాత్ర జరుగుతుందని, ఇందుకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొల్లి గంగు నాయుడు, ఎం.తిరుపతిరావు పాల్గొన్నారు.