Oct 17,2023 23:35
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ ఉషారాణి

ప్రజాశక్తి-దొనకొండ: మండలంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు గ్రామాల్లోని ప్రజల సమస్యలను బాధ్యతగా తీసుకొని పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఎంపీపీ ఉషారాణి సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సాధ్యం కాని సమస్యలను తమకు తెలిపితే జిల్లా సమావేశాల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామన్నారు. వైస్‌ ఎంపీపీ మిట్టా కోటిరెడ్డి మాట్లాడుతూ కొచ్చెర్లకోట పంచాయతీ పరిధిలోని ఆరు గ్రామాల్లో ప్రజలు బోర్లు అడుగంటి, బిల్లులు చెల్లించని కారణంగా ట్యాంకర్లు నిలిపివేయటంతో మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పంచాయతీలకు మంజూరైన నిధులతో బోర్లు ఏర్పాటు చేసి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. కొచ్చెర్లకోట-మార్కాపురం, మల్లంపేట-మార్కాపురం ప్రధాన రహదారులకు ఇరువైపులా చిల్లచెట్లు దట్టంగా పెరిగి తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వైస్‌ ఎంపీపీ-2 మిట్టా కోటిరెడ్డి, వడ్లమూడి వెంకటేశ్వర్లు, వివరించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లుల మంజూరులో హౌసింగ్‌ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కమర్షియల్‌ కాంప్లెక్సులకు బిల్లులు తక్షణమే మంజూరు చేస్తూ పేద లబ్ధిదారులను అనేక నిబందనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని మండల కోప్షన్‌ సభ్యుడు గఫార్‌ ఆరోపించారు. ఎంపీపీ జోక్యం చేసుకొని విచారించి తగిన చర్యలు చేపట్టాలని ఏఈని ఆదేశించారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు వారి శాఖల పరిధిలోని నివేదికలను వినిపించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సువర్ణ, ఎంపీడీవో వసంతరావునాయక్‌, జడ్పిటిసి సుధాకర్‌, అన్ని శాఖలకు చెందిన అధికారులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.