ప్రజాశక్తి-ఆదోని
'ప్రజారక్షణ భేరి'ని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సిపిఎం కార్యాలయంలో సిపిఎం మండల కార్యదర్శి లింగన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ప్రాజెక్టులు నిర్మించాలని, కరువుతో అల్లాడిపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. విద్యుత్ యూనిట్ రూపాయికే ఇవ్వాలని, పేదలకు 300 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని కోరారు. స్మార్ట్ మీటర్ల బిగింపు, ట్రూఅప్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ.400కే గ్యాస్, రూ.60కే లీటర్ పెట్రోలు, డీజిల్ ఇవ్వాలని కోరారు. ఇసుక ఉచితంగా, తలకు పది కిలోల ఉచిత బియ్యం, పప్పు నూనెల సరఫరా, నిత్యావసర ధరల తగ్గింంచాలని డిమాండ్ చేశారు. పేదలకు రెండు సెంట్ల ఇల్లు, రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. నివాసిత ప్రాంతాల్లోనే ఇళ్లకు పట్టాలు, కొత్తకాలనీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో 'ప్రజా రక్షణ భేరి'లో భాగంగా ఈనెల 30న రాష్ట్రస్థాయి బస్సుజాతా ఆదోని నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాయే తప్ప రాష్ట్రాభివృద్ధి, రైతుల కరువు సమస్యపై ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదని తెలిపారు. సిపిఎంగా ప్రజా సమస్యలను అజెండాగా చేర్చి పోరాడుతున్నట్లు చెప్పారు. ఈనెల 30న ఆదోని నుంచి ప్రారంభమయ్యే బస్సు జాతా కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, సత్యసాయి, పల్నాడు జిల్లాలను కలుపుతూ నవంబర్ 9న విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. నవంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభతో ఈ ప్రచార భేరి ముగుస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయి, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.రామాంజనేయులు, పిఎస్.రాధాకృష్ణ, కె.వెంకటేశులు, ఆదోని పట్టణ కార్యదర్శి డి.లక్ష్మణ్, ఎమ్మిగనూరు మండల కార్యదర్శి హనుమంతు, పెద్దకడబూరు మండల కార్యదర్శి తిక్కన్న, కోసిగి మండల కన్వీనర్ రాముడు, కౌతాళం మండల కన్వీనర్ వీరన్న, సిపిఎం సీనియర్ నాయకులు మల్లయ్య పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి










