Jul 29,2023 22:30

రాహుల్‌ బేరియం పరిశ్రమలో బాయిలర్‌ వద్ద అటవీ సంపద

       హిందూపురం : పారిశ్రామిక అభివృద్ధి పేరుతో బంగారాన్ని పండించే రైతుల భూములను ప్రభుత్వం అడ్డుగోలుగా పారిశ్రామిక వేత్తలకు ధారదత్తం చేస్తోంది. ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తలు కొందరు అధికారులను మామూళ్ల మత్తులో ఉంచి, ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదలి వారి పరిశ్రమల్లో అటవీ సంపదైన చెట్ల కలపను కాల్చేస్తున్నారు. ఈ విషయాలు తెలిసినా అటు రెవెన్యూ, ఇటు అటవీశాఖ అధికారులు వారిపై కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. శనివారం నాడు ప్రజాశక్తి హిందూపురం తూమకుటం పారిశ్రామిక వాడలోని రాహుల్‌ బేరియం రసాయన పరిశ్రమను పరిశీలించగా అక్కడ బాయిలర్‌ల వద్ద పెద్ద ఎత్తున కలప కన్పించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం రూరల్‌ మండలం తూమకుంట, గోళాపురం పారిశ్రామిక వాడులు పెద్దవి. ఇక్కడ దాదాపు 130కు పైగా వివిధ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ మందికి ఉపాదిని కల్పించే పరిశ్రమలతో పాటు తక్కువ మందికి ఉపాధినిచ్చేవి ఉన్నాయి. ఈ ప్రాంతంలో స్టీల్‌, రసాయన పరిశ్రమల వల్ల భూమి, వాతవరణం సైతం కాలుష్యం అవుతోంది. దీంతో ఈ మధ్య కాలంలో వెలసిన గార్మెంట్స్‌ పరిశ్రమల వల్ల భూమి కాలుష్యం పెరుగుతోంది. ఇదిచాలదన్నట్లు కాలుష్య చట్టాలతో పాటు వాల్టాచట్టానికి తూట్లు పొడచి, అటవీ సంపదను తెగ నరికి పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. అయినప్పటికీ అటు రెవెన్యూ, ఇటు అటవీ శాఖ అధికారులు అటు పక్క కన్నెత్తి చూడడం లేదు. ఈ పరిశ్రమలు చిమ్మే విషవాయువును నుంచి కాస్తా ఉపసమనం లభించాలంటే విరివిగా చెట్లను పెంచాల్సి ఉంది. దీని కోసం ప్రభుత్వలు వివిధ పథకాల పేరుతో చెట్లను పెంచుతున్నారు. ఆ చెట్లను కొంత మంది స్వార్థపరులు నరికి, పరిశ్రమల వారికి కలప రూపంలో అమ్ముతున్నారు. వాస్తవానికి పరిశ్రమల్లో అటవీసంపదను వినియోగించడానికి లేదు. ఇలా వినియోగిస్తే అది నేరం కూడా. పురం పారిశ్రామిక వాడలో మాత్రం యథేచ్ఛగా కలపను వినియోగిస్తున్నారు. పరిశ్రమలో బాయిలర్‌ ఉంటే దానికి గనుల నుంచి లభించే బొగ్గు లేదా గ్యాస్‌ను వాడాల్సి ఉంది. వీటిని వినియోగిస్తే ఆర్థిక భారం అవుతుందన్న ఉద్ధేశంతో యజమానులు అటవీ సంపదను వినియోగిస్తున్నారు. దీనిపై రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, అటవీ సంపదను వినియోగించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వాడ చుట్టుపక్కల ఉన్న రైతులు కోరుతున్నారు.