Jul 31,2023 20:23

గ్రామస్తులకు మందులు పంపిణీ చేస్తున్న వైద్య సిబ్బంది

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
గ్రామంలో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దహరివాణం పిహెచ్‌సి వైద్యులు అమ్రాన్‌ సూచించారు. సోమవారం మండలంలోని పెద్దహరివాణం గ్రామంలో ఉన్న శ్రీగర్జిలింగస్వామి దేవస్థానం ఆలయ ఆవరణంలో వైద్యులు అమ్రాన్‌ ఆదేశాల మేరకు వైద్య శిబిరం నిర్వహించినట్లు ఎఎన్‌ఎంలు పుష్పలత, లక్ష్మి, ఎంఎల్‌హెచ్‌పి కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వర్షాకాలంలో వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌, చికున్‌ గున్యా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే విషజ్వరాలు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని చెప్పారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, కాచి వడబోసిన నీటిని తాగడం మంచిదని సూచించారు.
గ్రామంలో కళ్లకలక (పింక్‌-ఐ) కేసులు
వైద్య శిబిరంలో భాగంగా గ్రామంలో సుమారు 20 మందికి కళ్లకలక గుర్తించామని, వారికి మందులు, చుక్క మందులు (సిరప్‌) అందించామని తెలిపారు. కళ్లకలక వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, అలర్జీల వల్ల వస్తుందని వివరించారు. ఇది అంటువ్యాధి అని, వ్యాధి సోకిన వ్యక్తి ఇతరులకు దూరంగా ఉంటూ తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. కళ్లను తాకవద్దని, వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గ్రామస్తులకు మందులతో పాటు, రక్త పరీక్షలు చేసి, గ్రామంలోని పురవీధుల్లో గ్రామ స్వచ్ఛ సిబ్బందితో కలిసి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. ఆశావర్కర్లు పాల్గొన్నారు.