Sep 01,2023 19:55

వేస్ట్‌ నీటిని బయటకు వదిలేస్తున్న వారికి నోటీసులు అందజేస్తున్న అధికారులు

ప్రజాశక్తి - చిప్పగిరి
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శి బాలన్న సూచించారు. శుక్రవారం సచివాలయ సిబ్బందితో కలిసి నేమకల్లు గ్రామసులకు అవగాహన కల్పించారు. నేమకల్లు గ్రామ ప్రధాన రహదారుల్లో నివసించే కుటుంబాలకు చెందిన వారు రోజూ బట్టలు ఉతికి వేస్ట్‌ నీటిని, చెత్తాచెదారాన్ని బయటకు వేస్తున్నారు. వారికి నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పదే పదే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతోందని తెలిపారు. ప్రజలు ఖాతరు చేయడం లేదని, నోటీసులు అందజేస్తున్నా పెడచెవున పెడుతున్నారని చెప్పారు. అలా చేయడం వల్ల దోమలు వ్యాప్తి చెంది అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. ఇంటి దగ్గరే చిన్నగా ఇంకుడు గుంతలు తవ్వుకొని అందులో వేస్ట్‌ నీటిని విడుచుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. మహిళ సంరక్షకులు పావని, సచివాలయ అధికారులు దినేష్‌, రాజేశ్వరి, లక్ష్మి పాల్గొన్నారు.