ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
చాలామంది ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారంటే దానికి కారణం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమేనని, కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా రెడ్‌క్రాస్ కార్యదర్శి బి.బెన్నీ తెలిపారు. స్వచ్ఛత సేవా పక్షోత్సవాలలో భాగంగా 19 ఆంధ్రా బెటాలియన్ ఎన్‌సిసి, రెడ్‌క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కెపిడిటి హైస్కూల్, సర్ సిఆర్‌ఆర్ పబ్లిక్ స్కూల్, శ్రీవెంకటేశ్వర జూనియర్, డిగ్రీ కళాశాల ఎన్‌సిసి విద్యార్థులు, రెడ్‌క్రాస్ నర్సింగ్ విద్యార్థినిలు ఆసుపత్రి పరిసరాలను శుభ్రపరిచారు. ఎన్‌సిసి ఆఫీసర్లు కె.శివశంకర్, అనంత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ 19 ఆంధ్ర బెటాలియన్ సూచనలతో, రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి రాము సూర్యారావు, డాక్టర్ ఆర్‌ఎస్‌ఆర్ కె.వరప్రసాదరావు, రేవూరి శివ ప్రసాద్, ఎన్‌సిసి ఆఫీసర్లు ఎస్.రామయ్య, తదితరులు పాల్గొన్నారు.










