ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : ఇప్పటి వరకు నిర్వహించిన సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన సమస్యలకు పరిష్కార మార్గం చూపించలేదు. మండలంలోని పలు సమస్యలను ఎంపిటిసి సభ్యులు సభా వేదిక దృష్టికి తీసుకొచ్చినా పరిష్కారానికి నోచుకోలేదు. ప్రస్తావించిన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్న అధికారులు కనీసం స్పందించడం లేదు. దీంతో సమావేశాలు పెట్టి కాలయాపన చేయడమే తప్ప మరొకటి లేదని చెముడు గూడ, ఇరిడి ఎంపిటిసిలు మండంగి రమణ, డుమ్మంగి సర్పంచ్ పాలక క్రాంతికుమార్ అన్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి నేడు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలోనైనా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారో, లేదో చూడాల్సిందే.
గత సమావేశంలో ప్రస్తావించినవి
- డుమ్మంగిలో పాఠశాల ఏర్పాటు చేయాలని, ఇరిడి, తోలు ఖర్జ, మల్లుగూడలో పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి
- గిరిజనులు పండించే జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, గిరిజన సహకార సంస్థ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని, క్రిమిసంహారక మందులు అందించాలి.
- టెంకసింగి, గుణద, బాసంగి, డుమ్మంగి గ్రామాల్లో సిసి రోడ్లు మంజూరు చేయాలి.
-డుమ్మంగి గ్రామ సమీపంలో మంజూరైన జలజీవన్ మిషన్ పనులు పూర్తి చేయాలి.
- గిరిజన గ్రామాల్లో తాగునీరు, రహదారి సౌకర్యం కల్పించాలి.
- గతంలో నిర్మించిన చెక్ డ్యాములు, మినీ రిజర్వాయర్ వంటి సాగునీటి వనరులను అభివృద్ధి పర్చి పంట పొలాలకు సాగునీరందించాలని ఇలా ఎన్నో సమస్యలను ప్రస్తావించిన నేటికీ పరిష్కరించలేదు.
నేడు మండల సర్వసభ్య సమావేశం
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపిడిఒ సాల్మన్‌రాజు తెలిపారు. ఎంపిపి కె.దీనమయ్య అధ్యక్షతన జరిగే సమావేశానికి సర్పంచులు, ఎంపిటిసిలు, మండల అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు.










