Oct 30,2023 20:54

ప్రమాదానాకి గురైన ఆటో (ఫైల్‌)

ప్రజాశక్తి - ఆస్పరి
ఆటో డ్రైవర్లు పరిమితికి మించి కూలీలను ఎక్కించుకొని వెళ్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల ఆస్పరి గ్రామం నుంచి వ్యవసాయ పనుల నిమిత్తం తీసుకెళ్తూ ఆటో డ్రైవర్లు ప్రమాదాలకు గురి చేస్తున్నారు. అప్పీ ఆటోలో నలుగురు మాత్రమే ఎక్కించుకోవాలి. ఆటో డ్రైవర్‌ 20 మందికి పైగానే ఎక్కిస్తుండడంతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
వరుసగా ఆటో ప్రమాదాలు
మండలంలోని జోహారపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ గతనెల 7న దాదాపు 30 మంది కూలీలను ఎక్కించుకొని దేవనకొండ మండలంలోని రైతులకు పత్తి కోతకు బయల్దేరారు. అటికేల గుండు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో కూలీల ఆటోను ఢకొీనడంతో ఆస్పరికి చెందిన వెంకటేశ్వరమ్మ, లక్ష్మి, జోహారపురం గ్రామానికి చెందిన కర్ణ, ఎర్రన్న, సంతోషమ్మ, అంజనమ్మ అనే కూలీలకు కాళ్లు, చేతులు విరిగాయి. ఈనెల 27న నలకదొడ్డి గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో అరికెర సాయి, బుక్కా వెంకటేష్‌లు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 29న ఆస్పరి గ్రామానికి చెందిన కూలీలు దేవనకొండలో కూలి పనులకు వెళ్తుండగా అట్టేకల్లు గ్రామ సమీపంలో ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలకు చేతులు విరిగాయి. చాలా మంది ఆటో డ్రైవర్లకు, ద్విచక్ర వాహన చోదకులకు లైసెన్సులు కూడా లేవు. వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పోలీసుల బాధ్యత రహిత్యమే కారణమా..?
మండలంలో ఇటీవల జరుగుతున్న ఆటో ప్రమాదాలకు పోలీసులు బాధ్యత రహిత్యమే కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. రోజూ ఉదయం ఆటోల్లో కూలీలు కింద, పైన ఎక్కించుకొని వెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడమే లేదు. ప్రమాదాలు జరుగుతున్నప్పుడు హడావిడి చేస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదు. ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.