Aug 01,2023 22:51

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
ప్రధాన రహదారుల్లో పశువుల సంచారాన్ని నివారించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం సంయుక్త కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌, డిఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, జిల్లాఅధికారులు, క్షేత్రాధికారులతో కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి రహదారుల్లో పశువుల తొలగింపు, ఆక్వా జోన్‌, ఓటర్ల జాబితా పరిశీలన, జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మచిలీపట్నం నగరంలో పలుచోట్ల రహదారుల్లో అడ్డంగా పశువులు ఉంటున్నాయని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. జిల్లాలో ఆక్వాజోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌ ఎంత ఉందో వివరాలు సేకరించాలని, ఆక్వా జోన్ల పరిధిలో ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు ఏ మేరకు ఉన్నాయో వాటి వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 11వ తేదీలోగా అందించాలని జిల్లా మత్స్యశాఖ అధికారిని ఆదేశించారు. ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీలోగా సజావుగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం, ఉయ్యూరు గుడివాడ ఆర్డీవోలు ఐ.కిషోర్‌, విజరుకుమార్‌, పద్మావతి, మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సంతృప్తికరంగా జగనన్న సురక్ష
నెల రోజుల పాటు జిల్లాలో నిర్వహించిన జగనన్న సురక్ష పథకంతో ప్రజల సంతప్తిస్థాయిని పెంచగలిగామని జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. మంగళవారం స్పందన సమావేశ హాలులో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గత నెల ఒకటో తేదీనుంచి నిర్వహించిన జగనన్న సురక్ష శిబిరాలలో సుమారు లక్ష మంది ప్రజలు హాజరయ్యారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు 90 శాతం మందికి అందడం పట్ల వారు ఎంతో సంతప్తి వ్యక్తం చేశారని స్పష్టం చేశారు. కష్ణాజిల్లాలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని 508 సచివాలయాల్లో జగనన్న సురక్ష నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ముఖ్యపాత్ర వహించిన అధికారులకు, సహకరించిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, డిఎల్‌ డిఓ సుబ్బారావు పాల్గొన్నారు.