ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : మండలంలోని మండ గ్రామ సమీపాన ప్రధాన రహదారిపై సోమవారం అర్ధరాత్రి భారీ వృక్షం కొమ్మ కూలింది. ఆ సమయంలో ఎటువంటి వాహనంగానీ, జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగించే వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎల్విన్‌పేట పోలీసులు, ఆర్ అండ్ బి అధికారులు స్పందించి జెసిబి సాయంతో మంగళవారం ఉదయం చెట్టు కొమ్మను తొలగించి రాకపోకలకు వీలు కల్పించారు. అయితే గుమ్మలక్ష్మీపురం నుంచి కురుపాం వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఏళ్ల తరబడి ఉన్న చెట్లుకు కాలం చెల్లడంతో అవి ఏ క్షణాన కూలుతాయో తెలియని పరిస్థితి. పలుమార్లు ఇదే విషయాన్ని పత్రికల్లో పలుమార్లు ప్రస్తావించినా ఆర్‌అండ్‌బి అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి విమర్శలు వస్తున్నాయి. చెట్లు కూలినప్పుడే మాత్రమే కనిపిస్తున్నారని అన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందుగా పోలీసులు స్పందిస్తున్న ఆర్ అండ్ బి అధికారుల జాడ మాత్రం కానరావడం లేదు. తరుచు ఈ ప్రాంతంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు కూలడం పరిపాటిగా మారింది. రెండు నెలల క్రిందట పి.ఆమిటి బస్ షెల్టర్ సమీపంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై చెట్టు కూలడంతో నడుము విరిగింది. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నత స్థాయి అధికారులైనా స్పందించి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా వాహనదారులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.










