ప్రజాశక్తి-గన్నవరం : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవు తున్న మధ్యాహ్న భోజన పథకం వంటకు అవసరమైన గ్యాస్ బండలను ప్రభుత్వమే సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గండికోట సమ్మక్క కోరారు. శుక్రవారం స్థానిక సంఘ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీ కార్మికుల సంఘం సమావేశం జరిగింది. దీనికి ఆ సంఘ నాయకురాలు కుమారి అధ్యక్షత వహించారు. సమ్మక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో తీసుకువచ్చిన మార్పుల వల్ల పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం అందుతుందని, ఇది మంచి పరిణామం అని చెప్పారు. అయితే పిల్లలకు పౌష్టికాహారం వండి పెడుతున్న వంట కార్మికులకు మాత్రం కష్టాలు, నష్టాలు మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా బడ్జెట్ను పెంచకపోవడం వల్ల అప్పుల పాలు కావాల్సి వచ్చిందని చెప్పారు. దీనికి తోడు నెలవారి బిల్లులు ఇవ్వకపోవడం వల్ల చిల్లర దుకాణాల్లో వేలకవేలు అప్పులు పేరుకుపోవడంతో కొత్త అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మరోవైపు పుల్లల పొయ్యి మీద వంట చేయకూడదని గ్యాస్ బండలు మాత్రమే వాడాలని నిబంధన పెట్టడంతో ఇది వంట ఏజెన్సీ కార్మికులకు పెద్ద గుడిబండగా మారిందని చెప్పారు. ఏడాదికి 12 బండలు ఇస్తూ ఉండగా ఐస్ కోళ్లలో వంట చేసే వారికి నెలకు 12 బండలు ఖర్చు అవుతున్నాయని తెలిపారు. రెండో నెల నుంచి వంట చేయాలంటే గ్యాస్ బండలు ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. పుల్లల మీద వంట చేయడానికి హెచ్‌ఎంలు, అధికారులు అంగీకరించడం లేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే గ్యాస్ బండలు సరఫరా చేయాలని విన్నవించారు. అదేవిధంగా పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఎంపీపీ స్కూల్లో, ఎంపీయూపీ జిల్లా పరిషత్ హై స్కూళ్ల మెనూ ఛార్జీలు పెంచడంతోపాటు కార్మికులకు గౌరవ వేతనాలు పెంచి నెలవారీగా మంజూరు చేయాలని కోరారు. వంటకు వాడే నిత్యవసర సరుకులు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తే ఏజెన్సీలకు ఏ విధమైన ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ముఖ్యంగా చాలా కాలంగా పనిచేస్తున్న తమను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కే. వెంకటేశ్వరరావు, మండల నాయకులు మహేష్, వంట ఏజెన్సీ కార్మికుల సంఘం నాయకులు సుందరి, వసుమతి పాల్గొన్నారు.










