ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా మీడియా పాత్ర కీలకం
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎం.వెంకటేశ్వర ప్రసాద్
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రజలకు చేరవేయటంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కీలక భూమిక పోషిస్తోందని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎం. వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. మంగళవారం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయంలో మచిలీపట్టణానికి చెందిన చెందిన పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో డిఐపిఆర్‌ఒ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత ఆయన పేరు పేరున పాత్రికేయులందరిని పరిచయం చేసుకొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ స్నేహపూరిత వాతావరణంలో నిత్యం సమాచార శాఖ అధికారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలిసిమెలిసి సోదరులు మాదిరిగా సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. పాత్రికేయులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలాగా పనిచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి, నాడు-నేడు, రైతు భరోసా, వైఎఎస్సార్ ఆసరా, వసతి దీవెన, విద్యా దీవెన తదితర రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి ,సంక్షేమ పథకాల సమాచారాన్ని వార్తలను, విజయ గాథలను ప్రజలకు చేరవేయాలన్నారు. సమాచార శాఖ పీఆర్వోలు, పాత్రికేయులు సమన్వయంతో పనిచేసి కృష్ణాజిల్లాకు మంచిపేరును తీసుకు రావాలని కోరారు. మీడియా పరంగా ఏదైనా సమస్యలు ఎదురైతే నేరుగా తన దృష్టికి తీసుకు రావాలని ఆయన పాత్రికేయులకు సూచించారు. ఈ సమావేశంలో డివిజనల్ పి ఆర్ ఓ ఎస్. శ్రీనివాసరావు, ఏఈఐఈ, జె.శ్రీనివాసరావు, పిఆర్ ఓ ఎన్.జాన్సన్ జాకబ్, పలువురు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.










