ప్రజాశక్తి - దేవనకొండ
ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులకు కూడా రక్షణ లేదని టిడిపి మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, నాయకులు బడిగింజల రంగన్న విమర్శించారు. బుధవారం టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసిపి స్థానిక నాయకుడు, ఓ ప్రజాప్రతినిధి గ్రూపునకు చెందిన వారు వినియోగంలో లేని ప్రభుత్వ డిఎన్‌టి హాస్టల్ భవనాన్ని ధ్వంసం చేసి, కిటికీలు, టేకు దూలాలు అమ్ముకునేందుకు కుట్ర పన్నారంటే వైసిపి నాయకులు ఎంతకు దిగజారి పోతున్నారో అర్థమవుతుందని తెలిపారు. ఎవరి సహకారంతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారో సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మండలంలోని విద్యార్థులకు దేవనకొండలో హాస్టల్ లేదనే విషయం తెలిసిందేనని, విద్యార్థులు లేనందునే హాస్టల్ మూసి వేశామని అధికారులు చెప్పడం సిగ్గు చేటని తెలిపారు. ప్రభుత్వం హాస్టల్‌కు సొంత భవనం కేటాయించి మెరుగైన వసతులు కల్పిస్తే విద్యార్థులు ఎందుకు రారని ప్రశ్నించారు. బయట హాస్టల్ అని బోర్డు పెట్టుకొని స్థానిక వైసిపి నాయకులు ఆ భవనాన్ని కబ్జా చేసి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మండల స్థాయి అధికారులు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని మండిపడ్డారు. కనీసం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఆస్తులను కాపాడేందుకు ముందుగా ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సమావేశంలో మాట్లాడుతున్న విజయభాస్కర్ గౌడ్










